
ఐపీఎల్-2022 సీజన్‌లో ఆర్సీబీ ప్లేయర్ దినేష్ కార్తీక్ తన క్లాసిక్, ఫినిషింగ్ బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే అతని ప్రదర్శనను పలువురు క్రికెట్ ప్రముఖులు మెచ్చుకున్నారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ క్రికెటర్.. మిస్టర్ 360డిగ్రీస్ ఏబీ డివిలియర్స్ కూడా దినేష్ కార్తీక్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆర్సీబీ జట్టుకు 10సంవత్సరాల పాటు ఆడిన డివిలియర్స్ కీలక ఆటగాడిగా ఎన్నో మ్యాచ్‌లను తన ఫినిషింగ్‌తో గెలిపించాడు. ఆర్సీబీతో డివిలియర్స్‌కు మంచి అనుబంధం ఉంది. ఇక తన కొత్త ఫ్రాంచైజీ కోసం నిలకడగా రాణిస్తున్న ఆ జట్టు కొత్త ఫినిషర్ దినేష్ కార్తీక్ ఆటను అతను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.
ఈ ఏడాది ఆర్సీబీ జట్టులో డివిలియర్స్ పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై ఆర్సీబీ అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి, ఎందుకంటే అతని లోటును భర్తీ చేయగలిగే ఆటగాడు దొరకడం చాలా కష్టం. కానీ దినేష్ కార్తీక్ డివిలియర్స్ లేని లోటును ఇప్పటివరకు సమర్థవంతంగా పూడ్చగలిగాడు. కార్తీక్ బెంగుళూరు బ్యాటింగ్ లైనప్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. డివిలియర్స్ లాగే తన 360-డిగ్రీల బ్యాటింగ్‌తో ఇప్పటికే పలు మ్యాచ్‌లను గెలిపించాడు.
గత ఏడాది అన్ని రకాల క్రికెట్‌లకు డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. కార్తీక్ తన ఆటతో తనను ఉత్తేజపరిచాడని, మళ్లీ క్రికెట్ ఆడడానికి రావాలని అనిపిస్తుందని చెప్పాడు. "దినేశ్ కార్తీక్ ప్రస్తుతం ఉన్న ఫామ్ వల్ల అతను ఇప్పటికే ఆర్సీబీని రెండు మూడు మ్యాచ్‌ల్లో గెలిపించాడు. అతను తన కెరీర్లోనే ఇప్పుడు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తుంది. అసలు ఈ ఫామ్ అతనికి ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసి అతను అంత ఎక్కువ డొమెస్టిక్ క్రికెట్ ఆడలేదు. అతను తన కెరీర్ ఎండింగ్ దశలో ఉన్నట్లు భావించాను.
కానీ సర్‌ప్రైజింగ్‌గా మరింత శక్తిమంతమైన బ్యాట్స్‌మెన్‌గా మారి ఆడుతుండడం నమ్మశక్యంగా లేదు. అతను వికెట్ చుట్టూ 360డిగ్రీల తిరుగుతూ షాట్లు ఆడగలడు. అతడి ఆటను చూస్తుంటే నాకు తిరిగి మళ్లీ క్రికెట్ ఆడాలనిపిస్తుంది. అతని ఆట నన్ను అంత ఉత్తేజపరుస్తోంది. మిడిల్ ఆర్డర్‌లో తీవ్ర ఒత్తిడిలోనూ కార్తీక్ ఆడగలడు. అతనికి చాలా అనుభవం ఉంది. తన ఫామ్‌ను కొనసాగించినట్లయితే ఆర్సీబీ చాలా ముందుకు వెళ్లే అవకాశం ఉంది" అని డివిలియర్స్ VUSport స్ట్రీమింగ్‌లో చెప్పాడు. దినేశ్ కార్తీక్ ఈ ఐపీఎల్లో ఆడిన 6మ్యాచ్‌ల్లో 197పరుగులు చేశాడు. అవి కూడా అత్యంత కీలక సమయాల్లో చేశాడు. జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపి ఉంచేందుకు గానో, గెలిపించేందుకు గానో అతను చేసిన పరుగులు అత్యంత కీలకమయ్యాయి.