
హైదరాబాద్: చిన్నతనంలో స్కూల్లో చిలిపి పనులు చేయడం, టీచర్ చేతిలో దెబ్బలు తినడం మామూలే. అయితే ఇలాంటి సెలబ్రిటీల విషయంలో కూడా జరుగుతుంటుంది. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన చిన్నతనంలో స్కూల్లో బాగా అల్లరి చేసేవాడంట.
ఇలా చేసి ఓ సారి స్కూల్ నుంచి బహిష్కరణకు కూడా గురయ్యాడు. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు డివిలియర్స్, డుప్లెసిస్‌ల చిన్ననాటి కోచ్ డీన్ బోట్స్. డుప్లెసిస్, డివిలియర్స్ ఇద్దరు కూడా చిన్నతనం నుంచే మంచి మిత్రులని ఆటతో పాటు అల్లరిలోనూ వీరిద్దరూ ఎప్పుడూ ముందుండేవారని క్రికెట్ నెక్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్యూలో డీన్ బోట్స్ వివరించాడు.
'అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న డివిలియర్స్ చిన్నప్పుడు మాత్రం అలా ఉండేవాడు కాదు. డివిలియర్స్ స్కూల్ రోజుల్లో పిల్లలు ఒకరితో మరొకరు రేడియోలో మాట్లాడుకోవడం అప్పట్లో ఓ ట్రెండ్. తనవంతు రాగానే డివిలియర్స్ గర్ల్స్ స్కూల్‌లోని అమ్మాయిలతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న పేరెంట్ ఒకరు ఈ విషయం గుర్తించి ఫిర్యాదు చేశాడు. ఇంకేముంది డివిలియర్స్‌ను స్కూళ్లో నుంచి గెంటేశారు' అని తెలిపాడు.
'ఇక, డుప్లెసిస్ విషయానికి వస్తే చిన్నప్పుడు చాలా అలర్లి చేసేవాడు. ఓరోజు ట్రైనింగ్ డుమ్మా కొట్టాలని స్కెచ్ వేశాడు. కోచ్ డీన్ బోట్స్ దగ్గరకొచ్చి నా కిట్ బ్యాగ్ రూమ్‌లో ఉంది. కానీ రూమ్ తాళం చెవి కనిపించడం లేదు. దీంతో బోట్స్ నువ్వేం చేస్తావో నాకు అనవసరం. సరిగ్గా సమయానికి మైదానంలో ఉండాల్సిందే' అని చెప్పాడు.
దీంతో కోచ్‌ని తిట్టుకుంటూనే డుప్లెసిస్ ట్రైనింగ్ వెళ్లాడు. ట్రైనింగ్ ముగిసిన తర్వాత 'తాళం లేదన్నావ్, ఎలా వచ్చావ్' అని బోట్స్ అడిగితే 'కిటికీ పగలగొట్టి బ్యాగ్ తెచ్చా' అని డుప్లెసిస్ బదులిచ్చాడఉ. అలా చేయడం తప్పుకదా అని కోచ్ చెప్పగా... 'నువ్వేం చేస్తావో నాకు అనవసరం ట్రైనింగ్‌కు రావాల్సిందే అని మీరే చెప్పారు కదా సార్' అనే బదులిచ్చాడు.
కాగా, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను మరో టెస్టు మిగిలుండగానే డుప్లెసిస్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు 2-0తో సిరిస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జనవరి 24న జోహెన్స్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియం వేదికగా జరగనుంది.