జోహన్నెస్‌బర్గ్/న్యూఢిల్లీ: అతడు మైదానంలో దిగాడంటే పరుగుల వర్షం కురవాల్సిందే. వేసిన బంతి బౌండరీ దాటాల్సిందే. అభిమానులు కేరింతలు కొట్టాల్సిందే. అతడే భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. అతని గురించి ఇప్పుడెందుకంటే.. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ సెహ్వాగ్ విధ్వంసం గురించి తన ఆటోబయోగ్రఫీలో ప్రశంసలు కురిపిస్తూ పేర్కొన్నాడు.
మంచి హిట్టర్‌గా పేరున్న ఏబీ డివిలియర్స్.. సెహ్వాగ్ మెరుపు ఇన్నింగ్స్‌కి ముగ్దుడయ్యాడు. అంతేగాక, ఆ విషయాన్ని సెప్టెంబరు 8న విడుదల కానున్న తన బయోగ్రఫీలో డివిలియర్స్ ప్రత్యేకంగా ప్రస్తావించాడట కూడా.

2008లో చెన్నై వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై చెలరేగిన భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఏకంగా ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కిన విషయం తెలిసిందే. ఈ టెస్టులో ఆకాశమే హద్దుగా చెలరేగిన సెహ్వాగ్ 304 బంతుల్లోనే (42ఫోర్లు, 5సిక్స్‌లు) 319 పరుగులు చేశాడు.
'ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మా జట్టు స్పిన్నర్ పాల్ హారిస్ లెగ్‌స్టంప్‌కు దూరంగా బంతిని విసిరినా.. సెహ్వాగ్ మాత్రం వెనక్కి వచ్చి మరీ కవర్స్ దిశగా చూడచక్కని బౌండరీ బాదేశాడు. టెస్టు క్రికెట్‌లో అలాంటి షాట్‌ను సాధారణంగా చూడలేం. కానీ, సెహ్వాగ్‌కే అది సాధ్యం. అందుకే టెస్టుల్లో ఇప్పటికీ నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ వీరేంద్ర సెహ్వాగ్‌దే' అని డివిలియర్స్ వివరించాడు.
రగ్బీ, టెన్నిస్‌ల్లోనూ ప్రావీణ్యమున్న డివిలియర్స్ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం వెనక కారణాలు, బాల్యం నుంచి జీవితంలో జరిగిన సంఘటనలు, క్రికెట్ అనుభవాలు, వివాదాలు గురించి ప్రస్తావించిన ఈ ఆత్మకథ పుస్తకంపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఈ పుస్తకంలో భారత్, కోహ్లీపై కూడా ప్రస్తావించాడు ఏబీ. భారత్ తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందంటూ ఆ పుస్తకంలో ఓ చాప్టర్‌ను కూడా చేర్చాడు.