హైదరాబాద్: సీజన్ ఆరంభం నుంచి అనుక్షణం ఉత్కంఠభరితంగా దాదాపు రెండునెలల పాటు సాగిన ధనాధన్ క్రికెట్ పోరులో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకున్నాయి. ఐపీఎల్-11లో బ్యాట్స్‌మెన్ బౌండరీల మెరుపులు.. బౌలర్లు అబ్బురపరిచే బంతులతో బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ పంపి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే, కళ్లుచెదిరే క్యాచ్‌లతో సూపర్మ్యాన్లను తలపించేలా ఫీల్డర్లు కూడా మెగా టోర్నీలో అభిమానులను ఆకట్టుకున్నారు.
ప్రతి మ్యాచ్‌లోనూ ఫీల్డర్లు ఊహించని రీతిలో క్యాచ్‌లు అందుకొని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఫీల్డర్ల అద్భుత విన్యాసాలతో మ్యాచ్ ఫలితాలే మారిపోయాయి. ప్రస్తుత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అందుకున్న క్యాచ్ టోర్నీలో హైలెట్‌గా నిలిచింది. తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పైడర్ మ్యాన్ తరహాలో అందుకున్న క్యాచ్ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీజన్లో ఇప్పటి వరకు నమోదైన బెస్ట్ క్యాచ్‌లుగా ఇవి టాప్‌లో నిలిచాయి. వీటిని ఐపీఎల్ అధికారిక వెబ్సైట్ ద్వారా అధికారికంగా విడుదల చేసింది. జరిగిన రెండు నెలల ఐపీఎల్లో నాలుగు నిమిషాల హైలెట్ క్యాచ్‌లు..
ముంబైలో జరిగే ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్లు ఆదివారం తలపడనున్నాయి. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లే చివరికి ఫైనల్లో తలపడటం విశేషం. ఈ మ్యాచ్‌లో సత్తా చాటి మూడోసారి టైటిల్ గెలవాలని చెన్నై పట్టుదలగా ఉండగా.. చెన్నైపై నెగ్గి రెండోసారి కప్ గెలవాలని హైదరాబాద్ ఉవ్విళ్లూరుతోంది. సీజన్ మధ్యలో ఆటగాళ్లు గాయాలబారిన పడటం ఆందోళన కలిగించినా.. తుది జట్టు ఎంపిక కోసం ఆటగాళ్లు ఎప్పుడూ అందుబాటులో ఉన్నారని ధోని తెలిపాడు.