ఐపీఎల్ ఫైనల్‌లో గుజరాత్ చేసిన ఆ తప్పు అస్సలు నచ్చలేదు: ఏబీడీ
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఆర్సీబీ చేతిలో ఘోర పరాజయం పాలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ కేవలం 155 పరుగులకే పరిమితమైంది. పిచ్ బౌలింగ్ కు కాస్త అనుకూలించినప్పటికీ.. గుజరాత్ టైటాన్స్ జట్టు యాజమాన్యం తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు ఆ జట్టు కొంపముంచాయి. ఫలితంగా ఆర్సీబీ సులభంగా విజయం సాధించి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే గుజరాత్ టైటాన్స్ ఓటమిపై ఆర్సీబీ మాజీ దిగ్గజం, ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఏబీ డివిలియర్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఆశిష్ నెహ్రా, గిల్ నిర్ణయంపై ఏబీడీ అసహనం
మ్యాచ్ జరుగుతున్న సమయంలో గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీసుకున్న ఓ రక్షణాత్మక నిర్ణయంపై ఏబీ డివిలియర్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మూడో ఓవర్లోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఔటయిన తర్వాత స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ బరిలోకి రావాల్సి ఉంది. కానీ గుజరాత్ యాజమాన్యం బట్లర్‌ను కాదని.. యువ ఆటగాడు నిశాంత్ సింధును మూడో నంబర్లో బ్యాటింగ్‌కు పంపింది. ఈ నిర్ణయాన్ని ఏబీ డివిలియర్స్ తీవ్రంగా తప్పుబట్టాడు.

"జోస్ బట్లర్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్‌ను ప్రారంభంలోనే రిస్క్‌లో పడేయడం ఇష్టం లేక, అతడిని వెనక్కి పంపారని నాకు అర్థమవుతోంది. నా కెరీర్‌లో కూడా నేను ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. బ్యాటింగ్ లైనప్‌ను బలంగా చూపించడం కోసం బట్లర్‌ను లోయర్ ఆర్డర్‌లో పంపడం పూర్తిగా రక్షణాత్మకమైన అడుగు. ఐపీఎల్ లాంటి పెద్ద ఫైనల్ మ్యాచ్‌లో నాకు ఈ మైండ్ సెట్ అస్సలు నచ్చలేదు" అని ఏబీ డివిలియర్స్ కామెంట్రీ బాక్స్ నుంచి ఓపెన్‌గా విమర్శించాడు.
పవర్ ప్లేలోనే కుప్పకూలిన గుజరాత్.. సుందర్ పోరాటం వృథా
గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఈ సీజన్ మొత్తంలో వెన్నెముకగా నిలిచిన ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఇద్దరూ పవర్‌ప్లేలోనే ఔట్ కావడం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ సీజన్‌లో ఇద్దరూ 700కు పైగా పరుగులు చేసినప్పటికీ.. ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేశారు. సుదర్శన్‌ను భువనేశ్వర్ కుమార్ ఔట్ చేయగా.. గిల్‌ను జోష్ హేజిల్‌వుడ్ పెవిలియన్‌కు పంపాడు. ఈ రెండు వికెట్లు పడిన తర్వాత గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా తడబడింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టును ఎలాగోలా 155 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు చేర్చాడు.
ఆర్సీబీ విధ్వంసం.. విరాట్ కోహ్లీ వన్ మ్యాన్ షో
రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని ఆర్సీబీ జట్టుకు 156 పరుగుల లక్ష్యం చాలా చిన్నదిగా అనిపించింది. ఆర్సీబీ ఓపెనర్లు పవర్ ప్లేలోనే ఏకంగా 70 పరుగులు రాబట్టారు. మిడిల్ ఓవర్లలో గుజరాత్ బౌలర్లు కొన్ని వికెట్లు తీసి మ్యాచ్‌లోకి రావాలని ప్రయత్నించినప్పటికీ.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఓ వైపు పాతుకుపోయాడు. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ 42 బంతుల్లోనే నాటౌట్‌గా 75 పరుగులు చేసి ఆర్సీబీని వరుసగా రెండో సారి ఛాంపియన్‌గా నిలబెట్టాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు భయపడుతూ ఆడి మ్యాచ్‌ను చేజార్చుకుంటే.. ఆర్సీబీ మాత్రం పక్కా ప్లానింగ్‌తో కప్పు కొట్టేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications