
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో తమ జట్టు సరికొత్తగా అనిపిస్తోందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్నాడు. ఈ ఏడాది లీగ్‌లో అత్యుత్తమ జట్టు మాదే అని చెప్పనని, అయితే ఆర్‌సీబీ చాలా తాజాగా అనిపిస్తోందని పేర్కొన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టును విలువలతో ముందుకు నడిపిస్తున్నాడని ఏబీ ప్రశంసించాడు. జట్టు కోసం అతనెంతో కష్టపడతాడని చెప్పుకొచ్చాడు.
ఆర్‌సీబీ యూట్యూబ్ ఛానల్ బోల్డ్ డైరీస్‌లో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ... 'ప్రతిసారీ ఈ సీజన్ మాదే అని చెప్పడం ఇబ్బందికరమే. ఏమీ వివరించలేను కానీ ఈ ఈఏడాది మాత్రం భిన్నంగా ఉంటుందని హామీ ఇవ్వగలను. ఐపీఎల్ లీగ్‌లో అత్యుత్తమ జట్టు మాదే అని చెప్పను. కానీ చాలా తాజాగా కనిపిస్తోంది. ఐపీఎల్ ఆడడంపై ఆత్రుతగా ఉంది. జట్టు కూర్పు గురించి ఆలోచిస్తున్నాం. విభిన్నంగా ప్రయత్నించేందుకు వనరులు ఉన్నాయి. అత్యుత్తమ జట్టును ఎంచుకొనేందుకు కోచ్, విరాట్‌కు చాలా ఆప్షన్స్ ఉన్నాయి' అని తెలిపాడు.
'ప్రతి మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ ఆడతాడని చెప్పలేను. పార్థివ్ పటేల్ లేదా డేల్ స్టెయిన్ జట్టులోని ఎవరైనా ఆడొచ్చు. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో చాలా వనరులు ఉన్నాయి. మా పని అత్యుత్తమంగా ఆడడమే. గతంలో బాగా ఆడలేదని కాదు. ఈ సారి మాత్రం ప్రతి ఒక్కరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందరూ కసితో కనిపిస్తున్నారు. అందుకు కోహ్లీని అభినందించాలి. జట్టును ముందుండి నడిపిస్తూ ప్రమాణాలు నిర్దేశిస్తాడు. అలాంటి నాయకుడు ఉంటే ఇవన్నీ అనుసరించడం సులభమే. సైమన్ కటిచ్, మైక్ హెసన్ అద్భుతంగా శిక్షణ ఇస్తున్నారు. వారి వ్యూహాలు ఫలిస్తాయనే అనుకుంటున్నా' అని ఏబీ డివిలియర్స్ చెప్పాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. కానీ ఇప్పటి వరకు ట్రోఫీని అందుకోలేదు. స్టార్లు ఎందరున్నా ఏదో ఒక విభాగంలో ఎప్పుడూ వెనకంజే వేస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో. ఈ నేపథ్యంలో ఆ జట్టులో సమూల మార్పులు చేశారు. కోచింగ్ సిబ్బందిని మార్చేశారు. క్రికెట్ డైరెక్టర్‌గా మైక్ హెసన్‌ను ఎంచుకున్నారు. బౌలింగ్, ఆల్‌రౌండ్ విభాగాలని పటిష్ఠం చేశారు. ఈసారి టైటిల్ పెట్టాలనే ఉద్దేశంతో ఉంది.