
సచిన్ కన్నా కోహ్లీనే బెస్ట్:
ఇటీవల కామెంటేటర్ పొమ్మీ ఎంబాంగ్వాతో జరిగిన ఇన్‌స్టాగ్రాం లైవ్ సెషన్‌లో డివిలియర్స్ మాట్లాడాడు. తాను ఐపీఎల్ వేదికగా విరాట్ కోహ్లీతో 8 ఏళ్లుగా కలిసి ఆడుతున్నానని, అతడిని చాలా దగ్గరగా గమనించానన్నాడు. 'కోహ్లీతో పాటు నాకు కూడా సచిన్ కూడా రోల్ మోడల్. ఆయన శకంలో సచిన్ ఓ అద్భుతం. క్రికెట్‌ను ఈ స్తాయిలో నిలబెట్టిన వారిలో ముఖ్యమైన వ్యక్తి సచినేనని కోహ్లీ చెబుతుంటాడు. అయితే నా దృష్టిలో మాత్రం సచిన్ కన్నా కోహ్లీ ఓ విషయంలో ముందుంటాడు. మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కోహ్లీ మొత్తం భారం తన మీద వేసుకుంటాడు. ఆ విషయంలో కోహ్లీకే నా ఓటు' అని తెలిపాడు.

టెన్నిస్‌కు రోజర్ ఫెదరర్ ఎలానో:
ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీలలో ఎవరు గొప్ప అని ఏబీని ప్రశ్నించగా.. టెన్నిస్‌కు రోజర్ ఫెదరర్ ఎలానో క్రికెట్‌కు విరాట్ కోహ్లీ అలా, అదే విధంగా స్టీవ్ స్మిత్‌ను రఫెల్ నాదల్‌తో పోల్చవచ్చని చెప్పాడు. కోహ్లీతో పోలిస్తే స్మిత్ మానసికంగా చాలా దృఢంగా ఉంటాడని ఏబీ తెలిపాడు. కోహ్లీ ఎప్పుడూ పరుగులు సాధించడంపై దృష్టి పెడతాడని అన్నాడు. వీరిద్దరిలో కోహ్లీయే ఫేవరెట్ అని తెలిపాడు. తన జీవితంలోనే చూసిన అత్యుత్తమ రన్ చేజర్ కోహ్లీయేనని చెప్పాడు.

ఆడినంత కాలం ఆర్‌సీబీతోనే:
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ చాలా కాలంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఆడినంత కాలం ఆర్‌సీబీ తరఫునే ప్రాతినిధ్యం వహిస్తానని కోహ్లీ అంటే.. డివిలియర్స్ కూడా బెంగళూరు జట్టును వీడనని తెలిపాడు. గతంలో కోహ్లీ, ఏబీ కలిసి భారత్-దక్షిణాఫ్రికా సంయుక్త వన్డే జట్టును ఎంపిక చేసారు. ఈ వన్డే జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్‌గా నియమించారు.

పేద ప్రజలను ఆదుకునేందుకు:
కరోనా వైరస్‌పై పోరాటంలో పేద ప్రజలను ఆదుకునేందుకు కోహ్లీ, ఏబీ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. 2016 ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్‌లో ఇద్దరు సెంచరీలు చేసినప్పటి జెర్సీలు, బ్యాట్లు, గ్లౌవ్స్ వేలం వేశారు. ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ 52 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్సర్లతో 129 పరుగులు చేసి అజేయంగా నిలవగా.. 55 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో కోహ్లీ 109 పరుగులు చేశాడు. పర్యావరణాన్ని ప్రోత్సహించే క్రమంలో ఆ రోజు ఆర్‌సీబీ గ్రీన్ జెర్సీలతో బరిలోకి దిగింది.


Click it and Unblock the Notifications












