
హైదరాబాద్: దక్షిణాఫ్రికా జట్టును గాయాలు వేధిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్, డీకాక్ గాయాలతో వన్డే సిరిస్‌తో పాటు మూడు టీ20ల సిరిస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా సఫారీ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ గాయం కారణంగా టీ20 సిరిస్ మొత్తానికి దూరమయ్యాడు.
ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. భారత్‌తో జరిగిన ఐదో వన్డేలో డివిలియర్స్ మోకాలికి గాయమైంది. పూర్తిగా కోలుకోవడానికి సమయం పట్టే అవకాశముందని దక్షిణాఫ్రికా జట్టు మేనేజర్ మహ్మద్ ముసాజీ మీడియాతో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆదివారం జరిగిన తొలి టీ20లో డివిలియర్స్ ఆడలేదు.
శుక్రవారం నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో డివిలియర్స్ పాసైనప్పటికీ.. గాయం ప్రభావం పడొద్దనే ఉద్దేశంతో విశ్రాంతి కల్పించామని చెప్పాడు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో రెండో టీ20 (ఫిబ్రవరి 21)న బుధవారం జరగనుండగా, మూడో మ్యాచ్ (ఫిబ్రవరి 24)న శనివారం జరగనుంది.
చేతి వేలి గాయం కారణంగా టీ20 సిరిస్‌కు ముందు భారత్‌తో జరిగిన ఆరు వన్డేల సిరిస్‌లో తొలి మూడు వన్డేలకు డివిలియర్స్ దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు మార్చి నెలలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను దృష్టిలో పెట్టుకుని డివిలియర్స్‌కు విశ్రాంతి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది.