
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా గురువారం జరగనున్న వన్డేలో భారత ప్రత్యర్థి సఫారీ జట్టుకు ప్రధాన లోపం. ఆ జట్టు లోని స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ తొలి మూడు వన్డేలకు దూరమయ్యాడు. అతడి కుడి చేతి వేలికి గాయం కావడమే ఇందుకు కారణం.
డివిలియర్స్ స్థానంలో వేరే ఆటగాడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఆరు వన్డేల సిరీస్ గురువారం ఆరంభమవుతుంది. ఫిబ్రవరి 10న జరిగే నాలుగో వన్డేకు ఏబీ అందుబాటులోకి వస్తాడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది.
వన్డేల్లో పరుగుల వరదే.. డుమిని:
వన్డే సిరీస్‌లో పరుగుల వరద ఖాయమని దక్షిణాఫ్రికా ఆటగాడు జేపీ డుమిని అన్నాడు. ''పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయమనిపిస్తోంది. దీని వల్ల పోటీ మరింత తీవ్రం కానుంది. వన్డే క్రికెట్లో బ్యాటుతో, బంతితో భాగస్వామ్యాలు ముఖ్యం. అవి నమోదు చేయడంలో విజయవంతమైన జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి'' అని చెప్పాడు.
కోహ్లీ సేఫ్:
బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లోనూ విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌కి మధ్య అగ్రస్థానం కోసం ఈ సిరీస్‌లో పోటీ నెలకొననుంది. కోహ్లి 876 పాయింట్లతో నెం.1 స్థానంలో ఉండగా.. తర్వాత ఏబీ డివిలియర్స్ (876) అదే పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ (823), రోహిత్ శర్మ (816) ఉన్నారు. వన్డే మ్యాచ్‌ను బట్టే కోహ్లీ ర్యాంకు కూడా ఆధారపడి ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.