
ఐపీఎల్‌లో ఏబీ డివిల్లీర్స్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన 360 డిగ్రీల షాట్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించడం అతని స్పెషాల్టీ. తన ఐపీఎల్ కెరీర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఎన్నో మరపురాని ఇన్నింగ్సులు ఆడిన అతను తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ ఆడిన బెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. తన కెరీర్‌లో 184 ఐపీఎల్ మ్యాచుల్లో ఏకంగా 5162 పరుగులు చేశాడు. ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన అతను రిటైర్‌మెంట్ ప్రకటించడం అభిమానులకు చాలా గట్టి షాకిచ్చింది.
గతేడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ అభిమానులు.. డివిల్లీర్స్‌ను చాలా ఎక్కువగా మిస్సయ్యారు. ఇదే విషయాన్ని ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెసాన్ కూడా వెల్లడించాడు. 2021 ఐపీఎల్ తర్వాత డివిల్లీర్స్ రిటైర్‌మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలిసినప్పుడు తను షాకైపోయానని హెసాన్ చెప్పాడు. 'రిటైర్‌మెంట్ తీసుకోవద్దని చాలా రకాలుగా డివిల్లీర్స్‌కు చెప్పి చూశాం. ఎందుకంటే అతనో జీనియస్ ప్లేయర్. తర్వాతి ఏడాది ఎలా ఆడాలని ప్లాన్లు వేసుకుంటున్న సమయంలో.. ఆ ఫోన్ కాల్ రావడం చాలా కష్టంగా అనిపించింది. కానీ ఇంత కాలం తర్వాత అతని నిర్ణయాలను కూడా గౌరవించాలి కదా. అలా చేయకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతా' అని హెసాన్ వివరించాడు.
అదే సమయంలో డివిల్లీర్స్ ఎప్పటికీ ఆర్సీబీ ఫ్యామిలీకి చెందిన వాడేనని, వచ్చే సీజన్లలో ఆర్సీబీలో ఏదో ఒక పాత్ర పోషిస్తాడని చెప్పాడు. 'డివిల్లీర్స్ కచ్చితంగా ఆర్సీబీలో భాగంగానే ఉంటాడు. అతనికి సరిపోయే పాత్రలో, జట్టుకు కూడా ఉపయోగం ఉండేలా అతన్ని మళ్లీ ఆర్సీబీలో కలుపుకుంటాం. డివిల్లీర్స్‌కు ఆర్సీబీ అంటే ఎంత ఇష్టమో, విరాట్ కోహ్లీతో అతని స్నేహం ఎలాంటిదో మాకు చాలా బాగా తెలుసు' అని హెసాన్ స్పష్టం చేశాడు.