

హైదరాబాద్: ఏబీ అభిమానులకు శుభవార్త. దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మాజీ క్రికెటర్ ఐదు నెలల కిందట ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. అయితే, ఆ తర్వాత తాను మళ్లీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే విషయంపై స్పష్టతనివ్వలేదు.
ఈ మధ్య కాలంలో వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2019 సీజన్‌లో తాను ఆడనున్నట్లు తెలిపాడు. తాజాగా మరో టీ20 లీగ్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆధ్వర్యంలో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో పాల్గొనేందుకు డివిలియర్స్ సిద్ధమయ్యాడు.
వచ్చే ఏడాది జరగనున్న సీజన్‌లో తాను అరంగేట్రం చేయబోతున్నానని 34 ఏళ్ల ఏబీ డివిలియర్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో సందేశాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ 2019 ఫిబ్రవరిలో జరిగే పీఎస్‌ఎల్‌లో తాను భాగస్వామ్యం కాబోతున్నట్లు చెప్పాడు.
2004 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు, 141 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్ మొత్తం 50 సెంచరీలు, 137 హాఫ్ సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు సాధించాడు. ఐపీఎల్‌లో ఏబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
డివిలియర్స్ పేరిట అనేక రికార్డులు
అంతర్జాతీయ క్రికెట్‌లో డివిలియర్స్‌కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బంతుల్లో), ఫాస్టెస్ట్ సెంచరీ (31 బంతుల్లో), ఫాస్టెస్ట్ 150 (64 బంతుల్లో) రికార్డులు డివిలియర్స్ పేరిటే ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో రెండో అత్యధిక టెస్టు స్కోరు (278 నాటౌట్) కూడా డివిలియర్స్ పేరిటే ఉంది.
ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో అత్యధిక పాయింట్లు (935) సాధించిన దక్షిణాఫ్రికా క్రికెటర్ కూడా డివిలియర్సే కావడం విశేషం. మొత్తం 114 టెస్టుల్లో 50.66 సగటుతో 8765 పరుగులు చేశాడు. అందులో 22 సెంచరీలు ఉన్నాయి. ఇక, 228 వన్డేల్లో 53.50 సగటుతో 9577 పరుగులు చేశాడు.