పూణె: బుధవారం రాత్రి పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగుళూరు చేతిలో ఓటమి పాలైన రాజస్ధాన్ రాయల్స్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లో 66 పరుగులు చేసిన ఏబీ డెవిలియర్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
అయితే ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని ఏబీ డెవిలియర్స్ బెంగుళూరు విజయంలో కీలక పాత్ర పోషించిన మన్‌దీప్ సింగ్‌కు బహుమతిగా ఇచ్చాడు. మన్‌దీప్ సింగ్ 34 బంతుల్లో (7 ఫోర్లు, 2 సిక్సులు) కొట్టిన 54 పరుగులు బెంగుళూరు జట్టు రాజస్ధాన్‌పై 71 పరుగుల తేడాతో విజయం సాధించడంలో ముఖ్య భూమికను పోషించాయి.
55 పరుగులే 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న బెంగుళూరుని ఏబీ డెవిలినయర్స్, మన్‌దీప్ సింగ్ ఆదుకున్నారు. తొలి 10 ఓవర్లకు గాను 60 పరుగులు సాధించిన బెంగుళూరు, ఆ తర్వాతి 10 ఓవర్లకు 120 పరుగులు చేయడం విశేషం.

అంకిత్ శర్మ వేసిన 15వ ఓవర్‌లో ఏబీ డెవిలియర్స్ రెండు సిక్సులు, ఓ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాతి ఓవర్ నుంచి పరుగుల వరద పారించారు. డివిలియర్స్ 34 బంతుల్లో, మన్‌దీప్ సింగ్ 32 బంతుల్లో అర్ధ సెంచరీలు సాధించారు.
వీళ్లిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 67 బంతుల్లో 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఏబీ డెవిలియర్స్ మాట్లాడుతూ మన్‌దీప్ ఆటతీరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకునేలా ఉంది. నా బహుమతిగా దీనిని అతనికి అందిస్తున్నానని అన్నారు.
ఇక క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో చెన్నై సూపర్ సింగ్స్‌తో తలపడుతున్నారన్న ప్రశ్నకు గాను 'చెన్నై జట్టు ఇప్పటికే చాలా టోర్నమెంట్‌ల్లో విజయం సాధించింది. వారిని కట్టడి చేసేందుకు మా వద్ద ప్రణాళికలున్నాయి' అని అన్నారు.