
టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఇప్పుడంటే కొంత నెమ్మదస్తుడిలా కనిపిస్తున్నాడు కానీ.. ఒకప్పుడు కోహ్లీ అంటే గుర్తొచ్చేది అతని ఉత్సాహం, కోపం. మైదానంలో నూటికి నూటయాభై శాతం ప్రాణం పెట్టి ఆడే కోహ్లీ.. సెలబ్రేషన్స్ కూడా అలాగే ఉంటాయి. ప్రత్యర్థి అవుటైనప్పుడు, తను సెంచరీ చేసినప్పుడు కోహ్లీ రియాక్షన్స్ చూస్తే.. ఒకప్పుడు ప్రతి ఒక్కరూ కోహ్లీకి బాగా పొగరు అనే అనుకున్నారు. వీరిలో కోహ్లీ ప్రాణ స్నేహితుడు ఏబీ డివిల్లీర్స్ కూడా ఒకడు.
తాజాగా ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ కోసం బెంగళూరుకు చేరుకున్న డివిల్లీర్స్.. తనలాగే అక్కడకు వచ్చిన లెజెండ్ క్రిస్ గేల్‌తో మాట్లాడాడు. 'బోల్డ్ డైరీస్'లో భాగంగా వీళ్లిద్దరూ ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు ముచ్చటించారు. ఈ సందర్భంగా కోహ్లీని మొట్టమొదటి సారి చూసినప్పుడు ఫీలింగ్ ఏంటి? అని గేల్ ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వినగానే నవ్వేసిన డివిల్లీర్స్.. 'ఇదేం మొదటి సారి కాదు. నన్ను ఈ ప్రశ్న చాలా మంది చాలా సార్లు అడిగారు' అని చెప్పాడు.
'ఇంతకు ముందు కూడా ఇదే చెప్పా.. కోహ్లీని ఫస్ట్ టైం చూసినప్పుడు తనకు చాలా పొగరు అనుకున్నా. ఆ హెయిర్ స్టైల్ గట్రా చూసి అబ్బో అతని చాలా బలుపు అనుకున్నా. కానీ అతను ఎలాంటి మనిషో అర్థమైన మరుక్షణమే నా అభిప్రాయం మారిపోయింది. తన ఆటపై నాకు గౌరవం ఉండేది. కానీ తర్వాత పర్సనల్‌గా కోహ్లీ ఎంత మంచివాడో అర్థమైంది. కోహ్లీ చుట్టూ ఒక కనిపించని గోడ ఉంటుంది. అది కరిగి కొంచెం దారి చూపించిన తర్వాత తను ఎంత సింపుల్ మనిషో అర్థమైంది' అని డివిల్లీర్స్ చెప్పుకొచ్చాడు.
మొదటిసారి కలిసినప్పుడు కోహ్లీ తనకు నచ్చలేదని డివిల్లీర్స్ షాకింగ్ విషయం చెప్పాడు. 'ఇప్పుడైతే అంత మంచి మనిషి ఇంకొకడు లేడనే చెప్తా. కానీ అప్పుడు చూడగానే ఉఫ్.. ఈ మనిషి కొంచెం నేల మీద నడిస్తే బాగుంటుంది. మరీ అంత పొగరు ఉండకూడదు' అనుకున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత కోహ్లీ, డివిల్లీర్స్ ఇద్దరూ కూడా ఆర్సీబీ లెజెండ్స్‌గా మారిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ప్రాణ స్నేహితులుగా మారారు. కోహ్లీ మళ్లీ ఫామ్ అందుకున్న తర్వాత అందరి కన్నా ముందు సంతోషం వ్యక్తం చేసిన ప్లేయర్ కూడా డివిల్లీర్సే.