టీమిండియా స్టార్ పేసర్, హైదరబాదీ మహమ్మద్ సిరాజ్ మరోసారి వన్డేల్లో టాప్ బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సిరాజ్‌పై సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. వీళ్లిద్దరూ కలిసి ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ఆడిన సంగతి తెలిసిందే.
ఆసియా కప్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్.. ఫైనల్‌లో శ్రీలంకపై ఆరు వికెట్లు తీసుకొని చెలరేగాడు. ఈ క్రమంలోనే వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకాడు. దీని గురించి మాట్లాడిన డివిలియర్స్.. సిరాజ్ (Mohammed Siraj) ఓటమి ఒప్పుకోని నైజం, యాటిట్యూడ్ చాలా ప్రత్యేకమని కొనియాడాడు.

'సిరాజ్‌లో ప్రత్యేకంగా కనిపించేది అతని యాటిట్యూడ్. ఇలాంటి యాటిట్యూడ్ మన కాన్ఫిడెన్స్ ఎలా పెంచుతుందో నేను చాలాసార్లు చెప్పా. ఎప్పుడూ వెనకడుగు వేయకుండా, పోరాడుతూనే ఉండటం.. అదే సమయంలో నీ యాటిట్యూడ్ టీంమేట్స్‌కు కూడా అంటుకునేలా చేయాలి. అప్పుడు ప్లేయర్లు, ఫ్యాన్స్ అంతా నువ్వు అక్కడ ఉండాలని కోరుకుంటారు' అని డివిలియర్స్ (AB de Villiers) చెప్పాడు.
'అది జరిగిన రోజున మైదానంలో నువ్వు కూడా ఏదో ఒక అద్భుతం సృష్టిస్తావు' అని చెప్పాడీ మిస్టర్ 360. సిరాజ్ అలాంటి ప్లేయర్లలో ఒకడని, ఓటమిని ఒప్పుకోకుండా ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాడని మెచ్చుకున్నాడు. ఇలాంటి బౌలర్లనే తను ఎక్కువగా గౌరవిస్తానని, సిరాజ్ (Mohammed Siraj) అలాంటి బౌలరే అని అన్నాడు.
'బ్యాటర్‌ను ప్రతి బంతికీ అవుట్ చేయడానికి సిరాజ్ ప్రయత్నిస్తాడు. అది బ్యాటర్‌కు అర్థం అవుతుంది. ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంక బ్యాటర్లకు అది స్పష్టంగా కనిపించి ఉంటుంది. సిరాజ్ కెరీర్ ఆరంభం చూస్తే.. ఇది ఎంత గొప్ప మలుపో అర్థం చేసుకోవచ్చు. అయితే సిరాజ్ వికెట్ల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తన యాటిట్యూడ్ కూడా కరెక్ట్‌గా ఉంది. నన్నడిగితే సిరాజ్ (Mohammed Siraj) పర్‌ఫెక్ట్ ఫాస్ట్ బౌలర్' అని డివిలియర్స్ పేర్కొన్నాడు.