
సిడ్నీ: మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్ సమయాన్ని ఒక్కో ఆటగాడు ఒక్కో విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవైపు కుటుంబంతో సరదాగా గడుపుతూ.. మరోవైపు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. తాను ఏ పని చేసినా వెంటనే ఆ వీడియోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంటున్నాడు.
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్, ఓపెనర్ ఆరోన్ ఫించ్ కూడా తాజాగా వార్నర్‌ను ఫాలో అయ్యాడు. ఇటీవల వార్నర్ టిక్‌టాక్ వీడియోలనూ ఎంజాయ్ చేస్తూ వచ్చిన ఫించ్.. తాజాగా అతడు కూడా ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసాడు. చేతులను ఆడిస్తూ.. అటుఇటుకాని బాడీ మూమెంట్స్ చేసాడు. అయితే మూమెంట్స్ అనుకున్నంత మంచిగా రాకపోవడంతో డ్యాన్స్‌ను ఆపేశాడు. ఇక్కడ ఫించ్ బ్యాటింగ్ చేసినంత ఆత్మవిశ్వాసంతో చిందేయలేకపోయాడు. ఈ వీడియోను సరదాగా ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు. ఇంత ప్రయత్నించినా తనకు డ్యాన్స్ చేయడం రావడం లేదని, ఇక క్రికెట్‌కే పరిమితమైతే మేలేమో అనేలా క్యాప్షన్ పెట్టాడు.
'నా వయసు 30 దాటిపోవడంతో డ్యాన్స్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అందులోనూ డ్యాన్స్ చేస్తూ.. టిక్‌టాక్ యాప్‌లో వీడియో తీయడం ఇంకా ఇబ్బందిగా ఉంది. నా సహచరుడు వార్నర్ లాక్‌డౌన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వార్నర్ వయసులో పెద్దవాడైనా.. డ్యాన్స్ మాత్రం బాగా చేస్తున్నాడు. నేను కూడా అతని లాగా చేద్దామనుకున్నా.. కానీ కుదరలేదు. నా వరకు డ్యాన్స్ కంటే క్రికెట్ ఆటే బాగుంది' అంటూ వీడియోకి ఫించ్ క్యాప్షన్ జతచేశాడు.
అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కరోనా వైరస్ నేపథ్యంలో ఆలస్యమయ్యే అవకాశముందని ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు. అయితే టీ20 ప్రపంచకప్‌కు సన్నద్దమవ్వడానికి ముందు ఒక సిరీస్ ఆడితే బాగుంటుదనే విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియాకు లేఖ ద్వారా పేర్కొన్నట్లు తెలిపాడు. ఫించ్ ఆసీస్ తరపున 126 వన్డేల్లో 4882 పరుగులు, 61 టీ20ల్లో 1989 పరుగులు చేశాడు.
వైరస్ కారణంగా ఇప్పటికే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌తో పాటు ఐపీఎల్2020 వాయిదా పడ్డాయి. మరోవైపు ఈ ఏడాది చివరిలో తమ దేశంలో భారత్ పర్యటించకుంటే.. అది చాలా ఆందోళనకరమేనని ఆస్ట్రేలియా క్రికెటర్లు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆ జట్టు బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషేన్ మాట్లాడుతూ.. వచ్చే నాలుగైదు నెలల్లో తమ దేశంలో భారత్ పర్యటిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. లేకపోతే చాలా నిరాశపూరితమైన అంశమేనని పేర్కొన్నాడు.
View this post on InstagramOver 30 and trying to dance on TikTok. Might stick to cricket 😳 #quarantinelife
A post shared by Aaron Finch (@aaronfinch5) on