ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచులో ఆసీస్ టాపార్డర్ చెలరేగింది. వరుసగా నలుగురు ప్లేయర్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. ముఖ్యంగా ఓపెనర్ మిచెల్ మార్ష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీకి దగ్గర పడినా కూడా తన ఆటలో దూకుడు తగ్గించలేదీ ఆసీస్ స్టార్. ఈ క్రమంలో 96 పరుగుల వద్ద అవుటయ్యాడు.
దీన్ని గుర్తు చేసిన భారత మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా.. టీమిండియా యువ స్టార్స్ శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్‌పై పరోక్షంగా చురకలేశాడు. వీళ్లిద్దరూ కూడా ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచులో సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సెంచరీలు పూర్తి చేసుకోవడానికి 80ల్లోకి వచ్చినప్పటి నుంచి గిల్, అయ్యర్ చాలా నిదానంగా బ్యాటింగ్ చేశారు. మార్ష్ మాత్రం అసలు తనకు సెంచరీ టెన్షన్ లేనట్లు ఆడాడు.

ఈ మ్యాచులో 96 పరుగులు చేసిన అతనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆసీస్ 352 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. బదులుగా భారత్ కేవలం 286 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచులో మార్ష్ 13 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. దీనిపై తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన ఆకాష్ చోప్రా.. గిల్, అయ్యర్ బ్యాటింగ్ విధానంపై చురకలేశాడు.
'ఫ్లాట్ పిచ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారత్‌ను చితక్కొట్టింది. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన తొలి ఐదు ఓవర్లలో 51 పరుగులివ్వడం చాలా అరుదుగానే కనిపిస్తుంది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా భారీగానే పరుగులిచ్చారు. ఆస్ట్రేలియా టాప్ ఫోర్.. నలుగురూ హాఫ్ సెంచరీలు బాదారు. వారిలో ఎవరైనా సరే సెంచరీలు చేయగలిగే వారే' అని చోప్రా అన్నాడు.
'మిచెల్ మార్ష్ ఈ మైలురాయికి చాలా చేరువగా వచ్చాడు. అతని బ్యాటింగ్‌లో చాలా స్పష్టంగా కనిపించిన అంశం ఏంటంటే.. అతను తన జోరు తగ్గించలేదు. తన సెంచరీ గురించి ఏమాత్రం వర్నీ అవకుండా భారీ షాట్లు ఆడేందుకే ప్రయత్నించాడతను. అవుటవుతాననే భయం కూడా అతనిలో కనిపించలేదు' అని చోప్రా చెప్పాడు. దీంతో అయ్యర్, గిల్ ఆటతీరును చోప్రా టార్గెట్ చేశాడని ఫ్యాన్స్ అంటున్నారు.