CSK vs RR: గౌహతిలోని బర్సపారా స్డేడియం వేదికగా ఈ రోజు రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని సొంత మైదానమైన చెపాక్ స్టేడియం వేదికగా బెంగళూరుతో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. మరోవైపు ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటములను ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ కూ కూడా ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనదే. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని రాజస్థాన్ జట్టు పట్టుదలతో ఉంది.
ఈ నేపథ్యంలో సీఎస్కే తుది జట్టుపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక సూచనలు చేశాడు. గత రెండు మ్యాచ్‌లలో ఎలాంటి ప్రభావం చూపించని ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను కొనసాగించడం అనవసరమని ఆకాశ్ చోప్రా సూచించాడు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ రాణించకుండా ఆల్‌రౌండర్ పాత్రను ఎలా పోషిస్తాడని ప్రశ్నించాడు. తుది జట్టు విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.. సామ్ కరన్‌పై నమ్మకం ఉంచుతున్నారు.. కానీ అతను మాత్రం దారుణంగా ఆడుతున్నాడని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.

సామ్ కరన్ ఆల్ రౌండర్ పాత్రకు న్యాయం చేయడం లేదన్నాడు. ఆల్ రౌండర్ అంటే బ్యాటింగ్ లో విఫలమైనా.. బౌలింగ్ లోనైనా ప్రభావం చూపించాలని.. రెండింట్లోనూ విఫలమైతే ఇంకెందుకని ప్రశ్నించాడు. అందుకే సామ్ కరన్ ను పక్కన పెట్టాలని ఆకాశ్ చోప్రా సూచించాడు. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్రలతో పాటు రుతురాజ్ గైక్వాడ్ ఉంటే టాప్ ఆర్డర్ బలంగా మారుతుందన్నాడు. దీపక్ హుడా లేదా రాహుల్ త్రిపాఠిలలో ఒకరిని మాత్రమే ఆడించాలని చెప్పుకొచ్చాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే శివం దూబేను ఐదో స్థానంలో దింపాలని.. విజయ్ శంకర్ ను ఆరో స్థానంలో ఆడించాలన్నారు. రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని వరుసగా 7, 8 స్థానాల్లో వస్తారని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు.
రాజస్థాన్ జట్టుకు బౌలింగ్ సమస్యగా మారిందని.. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 7 ఓవర్లలోనే 100కు పైగా పరుగులు సమర్పించాడని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఆర్చర్ కు బదులు ఫజల్ అల్ ఫారూఖీని ఆడిస్తే ఫలితం మారే అవకాశం లేకపోలేదని చెప్రాడు.