
ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గర పడింది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు వేలంలో ఏ ఆటగాడు ఎంత ధర పలుకుతాడనే లెక్కలు కడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా ఐపీఎల్ మెగా వేలంపై తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఈ సారి వేలంలో ఐదుగురు భారత బౌలర్లు అత్యధిక ధర పలుకుతారని ఆయన అంచనా వేస్తున్నాడు. ఆ ఐదుగురు పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, స్పిన్నర్లు రాహుల్ చాహర్, యజుర్వేంద్ర చాహల్, ఆల్‌రౌండర్ దీపక్ చాహర్‌గా పేర్కొన్నాడు.
ఈ ఐదుగురిలోనూ బౌలింగ్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ వేలంలో అత్యధిక ధర పలుకుతాడని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కొత్త బంతిలో చాహర్ వికెట్ తీయగలడని చెప్పుకొచ్చాడు. అతని లాంటి మరో భారత బౌలర్‌ను చూడలేదని, మొదటి 3 ఓవర్లలోనే ప్రత్యర్థిని కట్టడి చేస్తాడన్నాడు. అంతేకాకుండా చాహర్ బ్యాట్‌తోనూ రాణించగలడన్నాడు. ఇక రెండో స్థానంలో స్పిన్నర్ యజుర్వేంద్ర చాహల్ ఉంటాడని పేర్కొన్నాడు. ఈ ఏడాది వేలంలో అత్యధిక ధర పలికిన భారత బౌలర్‌గా చాహల్ నిలుస్తాడని చోప్రా అంచనా వేశాడు. కొంతకాలంగా అతను సరైన ఫాంలో లేకపోయినప్పటికీ వేలంలో మంచి ధర పలుకుతాడని చోప్రా తెలిపాడు. అలాగే గత ఐపీఎల్ రెండో సీజన్లో చాహల్ రాణించాడని తెలిపాడు. ఆ తర్వాతి స్థానాల్లో అత్యధక ధర పలికిన భారత బౌలర్లలో స్పిన్నర్ రాహుల్ చాహర్, పేసర్ ఆవేష్ ఖాన్ నిలుస్తారని ఆయన అంచనా వేశాడు. తన 5 మంది జాబితాలో చివరగా ప్రసిద్ధ్ కృష్ణ అత్యధిక ధర పలికే వారిలో ఐదో స్థానంలో ఉంటాడని చెప్పుకొచ్చాడు.
అయితే ఆశాశ్ చోప్రా తన 5 మంది లిస్ట్‌లో గత సీజన్‌లో పర్పుల్ క్యాప్ అందుకున్న పేసర్ హర్షల్ పటేల్‌కు చోటు కల్పించకపోవడం గమనార్హం. గత సీజన్లో 32 వికెట్లతో సత్తా చాటిన హర్షల్ పటేల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు క్వాలిఫైయర్ రౌండ్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆశ్చర్యకరంగా ఈ సారి తమ రిటెన్షన్ జాబితాలో హర్షల్ పటేల్‌కు ఆర్సీబీ చోటు కల్పించలేదు. అయితే వేలంలో ఆర్సీబీ హర్షల్ పటేల్‌ను కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.