టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ గురించి మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర విషయాలు చెప్పాడు. రోడ్డుపై ట్రక్ డ్రైవర్‌తో గంభీర్ గొడవ పడిన సంఘటన గురించి ఓ పోడ్‌కాస్ట్‌లో చోప్రా వివరించాడు. గంభీర్‌కు త్వరగా కోపం వస్తుందని, అలాగే లోతైన భావోద్వేగంతో ఉంటాడని చెప్పాడు. గంభీర్, ఆకాశ్ చోప్రా ఢిల్లీకి చెందిన క్రికెటర్లు.
''ఒకప్పుడు ఢిల్లీలో గౌతమ్ గంభీర్ ట్రక్ డ్రైవర్‌తో గొడవపడ్డాడు. కారులో నుంచి దిగి, ట్రక్ పైకి ఎక్కి గంభీర్ డ్రైవర్ కాలర్ పట్టుకున్నాడు. ట్రక్ డ్రైవర్ రాంగ్ టర్న్ చేశాడు. అంతేగాక దుర్భాషలడాడు. దీంతో గంభీర్ అలా చేశాడు. గంభీర్ అంటే అది, అలా ఉంటాడు. అతను ఉద్వేగభరితమైన వ్యక్తి. ఎంతో శ్రమిస్తాడు''

''గంభీర్ కాస్త సీరియస్‌గా ఉంటాడు. కానీ ఎన్నో పరుగులు సాధించాడు. బాధ్యతలను భుజాలపై వేసుకుని హృదయంతో ఎల్లప్పుడూ ఆడతాడు. టెంపర్మెంట్ పరంగా.. అతనికి త్వరగా కోపం వస్తుంది. అయితే ప్రతి ఒక్కరికి ఓ స్వభావం ఉంటుంది'' అని గంభీర్ గురించి ఆకాశ్ చోప్రా మాట్లాడాడు. రాహుల్ ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ ఇటీవల బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే.
అయితే ఆటగాడిగానే కాకుండా మెంటార్‌గా మైదానంలో ఇతరులతో గంభీర్ గొడవపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఐపీఎల్-2023 సీజన్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లికి, లక్నో మెంటార్‌గా ఉన్న గంభీర్‌కు మధ్య జరిగిన గొడవ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక లక్నో నుంచి కేకేఆర్‌కు మెంటార్‌గా వెళ్లిన గంభీర్ ఆ జట్టుకు టైటిల్ అందించాడు.

అనంతరం టీమిండియాకు కోచ్‌గా వచ్చాడు. అయితే శ్రీలంక పర్యటనతో కోచింగ్ బాధ్యతలు అందుకున్న గంభీర్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాడు. లంకపై టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా, వన్డే సిరీస్‌ను ఓడిపోయింది. గురువారం నుంచి ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్‌పై ప్రస్తుతం గంభీర్ ఫోకస్ చేస్తున్నాడు. చెపాక్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్టు మొదలుకానుంది.