
దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021 సమయం దగ్గరపడుతోంది. శనివారం (అక్టోబర్ 23) మెగా టోర్నీ సూపర్ 12 రౌండ్ ఆరంభం కానుంది. ఇక 24న టీమిండియా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకు దాయాది దేశాల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులతో పాటు మాజీలు కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. భారత్-పాక్ మ్యాచుకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో క్రికెట్ మాజీలు, విశ్లేషకులు తమ తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కొందరు ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్‌ను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా టీమిండియాతో బరిలోకి దిగే తన పాకిస్తాన్ జట్టును ప్రకటించాడు.
యువ ఆటగాళ్లు హైదర్ అలీ, ఆసిఫ్ అలీలకు ఆకాష్ చోప్రా తన జట్టులో చోటు ఇవ్వలేదు. వీరి స్ధానంలో వెటరన్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌లను జట్టులోకి తీసుకున్నాడు. షోయబ్, హఫీజ్‌లకు ఎంతో అనుభవం ఉందని, అది పాకిస్తాన్ జట్టుకు ఉపయోగపడనుందని ఆకాష్ చోప్రా తన తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజమ్‌కు ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని చెప్పాడు. ఈ ఏడాది టీ20ల్లో ఇద్దరు ఆటగాళ్లు గొప్ప ఫామ్‌లో ఉన్నారని, ప్రాక్టీస్ మ్యాచులో విఫలమయినా భయపడాల్సిన అవసరం లేదన్నాడు. ప్రధాన మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఇద్దరు పరుగులు చేస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
వన్‌డౌన్‌లో ఫఖర్ జమాన్‌ను ఆకాష్ చోప్రా తన జట్టుకు ఎంచుకున్నాడు. నాలుగు, ఐదు స్థానాల్లో షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌ను ఎంపిక చేశాడు. వీరిద్దరి అనుభవం పాకిస్తాన్ జట్టుకు ఉపయోగపడనుందన్నాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీంకు ఆకాష్ చోటు కల్పించాడు. షాదాబ్, ఇమాద్ స్పిన్నర్లుగా రాణిస్తారని భారత మాజీ క్రికెటర్ పేర్కొన్నాడు. ఇక పేస్ బౌలింగ్ విభాగంలో షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ, హారిస్ రౌఫ్‌లను ఎంపిక చేశాడు ఆకాష్ చోప్రా.
ఆకాష్ చోప్రా పాకిస్తాన్ జట్టు ఇదే:
బాబర్ అజమ్ (కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షహీన్ షా అఫ్రిది.