
వాటిని ఏమాత్రం నమ్మను:
తాజాగా ఫేస్‌బుక్‌లో చేతేశ్వర్ పుజారా విషయంపై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆకాశ్ చోప్రా సమాధానమిచ్చాడు. 'ఇంగ్లండ్ పర్యటనలో పుజారాను ఆడించరనే వార్తలు వినిపిస్తున్నాయి. నేను వాటిని ఏమాత్రం నమ్మను. ఎందుకంటే టీమిండియా ఇదివరకు ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు అతడు సెంచరీ చేశాడు. మరోవైపు ఇంగ్లండ్‌లో పుజారా సగటు 30 కన్నా తక్కువుగా ఉందని మీరు ఆలోచిస్తున్నారని కూడా తెలుసు. అలాగే ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ రాణించలేదని తెలుసు. పుజారా చాలా నెమ్మదిగా ఆడటం వల్ల స్కోరు బోర్డు ముందుకు కదలదని అనిపిస్తుంది. అది అతడి బ్యాటింగ్ స్టైల్ అలాంటిది. తనకిష్టమొచ్చినట్లు ఆడతాడు. అలా ఆడటం వల్ల భారత జట్టు కూడా చాలా సార్లు లాభపడింది' అని ఆకాశ్ అన్నాడు.

భారీ స్కోర్లు రాలేదంతే:
'చేతేశ్వర్ పుజారా కచ్చితంగా ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు మ్యాచులోని తుది జట్టులో ఉంటాడని నేను నమ్ముతున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా అతడిని తొలగించదు. కచ్చితంగా తుది జట్టులో అట్టిపెట్టుకుంటుంది. ఈ పర్యటనలో అతడి సగటు కూడా మెరుగవుతుందని ఆశిస్తున్నా. గత రెండేళ్ల ఛాంపియన్‌షిప్ పోటీల్లో పుజారా అన్ని మ్యాచ్‌లూ ఆడాడు. కొన్ని కీలక ఇన్నింగ్స్ కూడా ఆడాడు. అయితే వాటిలో భారీ స్కోర్లు రాలేదంతే' అని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా వెల్లడించాడు. పుజారా 2019లో సిడ్నీ టెస్టులో చివరిసారి శతకం బాదాడు. ఆ తర్వాత భారత్ 18 టెస్టులు ఆడినా అతడు మరో శతకం సాధించలేదు.

30 ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ లేదు:
దిగ్గజం రాహుల్ ద్రవిడ్ అనంతరం భారత జట్టుకు మూడో స్థానంలో చేతేశ్వర్ పుజారా ఎంతో సేవ చేశాడు. ఈ క్రమంలో నయా వాల్‌గా పేరొందాడు. పుజారా సాధారణ టెస్టు సగటు 46.49. అయితే 2020 నుంచి అతడు ఆడిన మూడు సిరీస్‌లను పరిశీలిస్తే.. సగటు 26.35కే పరిమితమైంది. గత 30 ఇన్నింగ్స్‌లో పుజారా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అందులో 9 మ్యాచ్‌లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే వెనుదిరిగాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో టెస్టులో 77 పరుగులు చేసి పర్వాలేదు అనిపించినా.. మిగతా మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఇక స్ట్రైక్ రేట్ కూడా దారుణంగా ఉంటోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 34 బంతులు ఆడికాని పరుగుల ఖాతా తెరవలేదు.

పూజారా సగటు 29:
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చేతేశ్వర్ పూజారా బ్యాటింగ్ సగటు కూడా అతడిని తొలగించాలనడానికి బలమైన మరో కారణంగా కనబడుతోంది. డబ్ల్యూటీసీలో మూడో స్థానంలో ఆడిన ఆటగాళ్ల బ్యాటింగ్ సగటును ఓసారి పరిశీలిస్తే.. ఆసీస్ ప్లేయర్ మార్నస్ లబుషెన్ టాప్‌లో ఉన్నాడు. లబుషెన్ సగటు 73.10గా ఉంది. న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సగటు 61.20గా, పాకిస్తాన్ కెప్టెన్ అజర్ అలీ సగటు 44.13గా, ఇంగ్లండ్ సారథి జో రూట్ సగటు 32.91గా, బంగ్లాదేశ్ ప్లేయర్ నజ్ముల్ హుస్సేన్ సగటు 31.10 ఉండగా.. పూజారా సగటు మాత్రం 29.00గా ఉంది. ఇది భారత జట్టును కలవరపెడుతోంది. మరి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications












