
శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు లంచ్‌కు కొన్ని నిమిషాల ముందు ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో శ్రీలంక ప్లేయర్ కుశాల్ మెండిస్ మైదానాన్ని వీడాడు. ఇక ఢాకాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అతన్ని చేర్చారు. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ 23వ ఓవర్‌లో మైదానంలో అతను పడిపోవడంతో అతనికి ఫిజియో సిబ్బంది వచ్చి హుటాహుటిన ప్రాథమిక చికిత్స నిర్వహించారు. ఆ టైంలో మెండిస్ చాలా అసౌకర్యంగా కనిపించాడు.
అతను వెంటనే తన ఛాతీపై చేయి పట్టుకుని నొప్పితో విలవిల్లాడుతూ.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ వైద్యుడు మంజూర్ హొస్సేన్ చౌదరి ఈ విషయమై స్పందిస్తూ.. మెండిస్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం కోసం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లవలసి వచ్చిందని పేర్కొన్నాడు.
మంజుూర్ హొస్సేన్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. మెండిస్ మ్యాచ్‌లో తీవ్ర డీహైడ్రేషన్‌కు గురయినట్లు తెలుస్తోంది. అందువల్లే అతను అసౌకర్యానికి గురై ఉంటాడని పేర్కొన్నాడు. మెండిస్ అసౌకర్యానికి గ్యాస్ట్రిటిస్ ఒక కారణమని అనుమానించాడు. అతన్ని ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచుతారో మాత్రం తెలియదన్నాడు. ఇకపోతే ఢాకా టెస్ట్‌లో అతను మళ్లీ పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తొలి టెస్ట్ చటోగ్రామ్‌లో జరగగా.. మెండిస్ మొదటి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా 48పరుగులు చేసి శ్రీలంక ఆ మ్యాచ్‌ను డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక రెండో టెస్ట్‌లోనే కాకుండా మొదటి టెస్ట్‌లో కూడా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. చాలా పొడి వాతావరణం, ఉక్కపోత, ఎండ వల్ల ఆటగాళ్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు. తొలి టెస్టు మూడో రోజు తమీమ్ ఇక్బాల్ బ్యాటింగ్ చేస్తుండగా తీవ్ర హ్యుమిడిటీ కారణంగా రిటైర్ అయ్యాడు. ఆన్-ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో కూడా నాలుగో రోజు ఎండ కారణంగా మైదానాన్ని వదిలివెళ్లాడు. ఈ టెస్ట్ టైంలో ప్లేయర్లు డ్రింక్స్ బ్రేక్స్ పెద్ద పెద్ద గొడుగుల కింద తీసుకున్నాడు.
ప్రస్తుతం రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 24పరుగులకే 5వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడగా.. ఆ జట్టును ముష్ఫీకర్ రహీమ్, లిట్టన్ దాస్ ఆదుకున్నారు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్న లిట్టన్ దాస్ (106పరుగులు 158బంతుల్లో 14ఫోర్లు, 1సిక్సర్), ముష్ఫీకర్ రహీమ్ (87 పరుగులు 183బంతుల్లో 11పరుగులు)తో కలిసి 196పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ జోడీ ఇంకా క్రీజులోనే ఉంది. 65ఓవర్లు ముగిసేసరికి 5వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ 220పరుగులు చేసింది.