తాజాగా మొదలైన లంక ప్రీమియర్ లీగ్ రెండో మ్యాచులోనే వింత ఘటన జరిగింది. గాలె టైటాన్స్, దంబుల్ల ఆరా టీమ్స్ మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఒక పాము అంతరాయం కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సోమవారం ఈ రెండు టీమ్స్ తలపడుతుండగా.. మైదానంలోకి ఒక పాము దూసుకొచ్చింది.
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ ఘటన జరిగింది. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో గాలె టైటాన్స్ బౌలింగ్ చేస్తుండగా ఇది జరిగింది. ఈ టీం స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేయడానికి రెడీ అయ్యాడు. సరిగ్గా అప్పుడే మైదానంలోకి పాము వచ్చినట్లు స్క్రీన్‌పై చూపించారు. దీంతో కాసేపు మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది.

ఈ పామును గమనించిన గ్రౌండ్ స్టాఫ్ వెంటనే స్పందించి, దాన్ని పట్టేశారు. అనంతరం స్టేడియం బయటకు దాన్ని తీసుకెళ్లారు. అప్పుడు మళ్లీ మ్యాచ్ తిరిగి ప్రాంభమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీమిండియా వెటరన్ దినేష్ కార్తీక్ కూడా మైదానంలోకి పాము రావడంపై ట్వీట్ చేశాడు.
'ది నాగిన్ ఈజ్ బ్యాక్.. నేను ఇంకా బంగ్లాదేశ్ అనుకున్నా' అని డీకే కామెంట్ చేశాడు. గతంలో బంగ్లా ఆటగాళ్లు విజయం సాధించినప్పుడు నాగిన్ డ్యాన్స్ వేసి సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో నాగిన్ డ్యాన్స్ బాగా పాపులర్ అయింది. ఇదే విషయాన్ని డీకే గుర్తుచేశాడని ఫ్యాన్స్ అంటున్నారు.
అయితే గతేడాది సౌతాఫ్రికా, ఇండియా మధ్య జరిగిన టీ20 మ్యాచులో కూడా ఇలాంటి ఘటనే జరిగిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గాలె టైటాన్స్ అద్భుతంగా ఆడింది. భానుక రాజపక్స (48), కెప్టెన్ దాసున్ షనక (42 నాటౌట్) రాణించారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
ఛేజింగ్‌లో దంబుల్లా కూడా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులే చేసింది. ఈ టీంలో ధనంజయ డి సిల్వ (43), కుశాల్ పెరీరా (40), అలెక్స్ రాస్ (39) రాణించారు. దీంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. గాలె ఈ ఓవర్‌ను కాసున్ రజితకు ఇచ్చింది. ఈ ఓవర్లో కొంత తడబడిన దంబుల్లా ప్లేయర్లు కేవలం 9/1 స్కోరు మాత్రమే చేయగలిగారు.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన గాలె టైటాన్స్ కేవలం రెండు బంతుల్లోనే 11 పరుగులు చేసి మ్యాచ్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో తన ధనాధన్ ఆటతో గాలె విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ దాసున షనకకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.