టీ20 వరల్డ్ కప్ గెలిచి ఆలస్యంగా భారత్‌కు చేరిన రోహిత్ సేనకు గురువారం అపూర్వ స్వాగతం లభించింది. జూన్ 29న దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో విజయం సాధించి 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించిన టీమిండియాకు అభిమానులు అడుగడుగునా నీరాజనం పలికారు. బార్బోడస్ నుంచి ప్రత్యేకం విమానంలో భారత ఆటగాళ్లు మొదట ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి హోటల్‌కు వెళ్లారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.
మోదీతో సమావేశంగా ముగిసిన అనంతరం ముంబైకు చేరుకున్నారు. అయితే విశ్వవిజేతలకు స్వాగతం పలకాలని అభిమానులు భారీగా తరలివచ్చారు. మెరైన్‌డ్రైవ్ జనసంద్రాన్ని తలపించింది. ఓపెన్ టాప్ బస్సులో కొనసాగిన విజయోత్సవ ర్యాలీ చరిత్రలో నిలిచేలా సాగింది. క్రికెటర్లపై అభిమానులు పూల వర్షం కురిపించారు. మరోవైపు భారత ఆటగాళ్లు కప్‌ను ప్రదర్శిస్తూ అభిమానులకు అభివాదం చేశారు. వేలాది అభిమానుల మధ్య వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు.

అనంతరం వాంఖడే స్టేడియం అభిమానులతో నిండిపోయింది. కాగా, మైదానంలో 'ఛాంపియన్స్' వేదికపై భారత ఆటగాళ్లు మాట్లాడారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా వంటి స్టార్లు తమ అనుభూతిని పంచుకున్నారు. అయితే కోహ్లి.. బుమ్రాను కొనియాడాడు. భారత్ ప్రపంచకప్ గెలవడానికి అతనే ముఖ్యకారణమని చెప్పాడు. జట్టు కష్టాల్లో ప్రతిసారి బుమ్రానే ఆదుకున్నాడని, తిరిగి టీమ్‌ను పోటీలోకి తెచ్చాడని అన్నాడు. అలాగే రోహిత్ శర్మతో తనకి ఉన్న అనుబంధాన్ని కోహ్లి పంచుకున్నాడు.
''ఓ వ్యక్తిని నేను అభినందించాలి. మ్యాచ్‌లో మమ్మల్ని తిరిగి మళ్లీ మళ్లీ పోటీలోకి తీసుకువచ్చాడు. అతనే జస్‌ప్రీత్ బుమ్రా. తరానికి వచ్చే ఓ అద్భుతమైన బౌలర్ బుమ్రా. అతను మన తరఫున ఆడుతుండటం మన అదృష్టం. ఇక రోహిత్ శర్మను గతంలో ఎప్పుడూ ఇంతలా ఉద్వేగానికి గురి కావడం చూడలేదు. గత 15 ఏళ్లుగా అతనితో కలిసి ఆడుతున్నాను''
''ఫైనల్‌లో గెలిచి పెవిలియన్‌కు వెళ్తున్నప్పుడు రోహిత్ భావోద్వేగానికి గురయ్యాడు. అతను ఏడ్చేశాడు. నేను ఏడ్చేశాను. ఆ రోజును ఎప్పటికీ మరిచిపోలేను. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు సీనియర్లు ఉద్వేగానికి గురైనప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఈ అనుభవం ఇప్పుడు తెలుస్తోంది'' అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. కాగా, వ్యాఖ్యాతగా ఉన్న గౌరవ్ కపూర్ బుమ్రాను భారత దేశ నిధిగా భావిస్తారా అని కోహ్లిని ప్రశించాడు. దాని కోసం తొలి పిటిషన్ నేనే వేస్తాను అని కోహ్లి బదులిచ్చాడు. అలాగే ప్రపంచ 8వ వింత బుమ్రా అని కొనియాడాడు.