హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆవిష్కరించిన 'ఖేలో ఇండియా' కార్యక్రమంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ, క్రీడామంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోర్‌లకు సోషల్ మీడియా వేదికగా ఓ సందేశాన్ని పంపించాడు.
'మోడీ, క్రీడా మంత్రి ప్రారంభించిన ఈ కార్యక్రమం కచ్చితంగా భారత దేశంలోని క్రీడలకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది' అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఖేలో ఇండియాకు సంబంధించి కొత్త ఆవిష్కరణను బుధవారం కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ ట్విట్టర్‌లో ప్రకటించారు.

ఇప్పటివరకు కేవలం మౌలిక సదుపాయాలపైనే దృష్టిసారించిన ఈ కార్యక్రమం ఇక నుంచి అన్ని విధాలా అభివృద్ధే లక్ష్యంగా సాగనుంది. ఇందు కోసం వచ్చే మూడేళ్లకుగాను రూ. 1756 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. రాజీవ్‌గాంధీ ఖేల్ అభియాన్, అర్బన్ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్, నేషనల్ స్పోర్ట్స టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్‌లను కలిపి కొత్తగా ఖేలో ఇండియాను తీసుకొచ్చారు.
ఈ కార్యక్రమం ద్వారా మన దేశంలో అత్యున్నత క్రీడాకారులను తయారుచేసే 20 యూనివర్సిటీలను ఎంపిక చేసి వాటికి మరిన్ని నిధులు కేటాయించనున్నారు. ఇటీవలే ఆసియా, కామన్వెల్త్, టోక్యో (2020) ఒలింపిక్స్ లాంటి ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్లకు సిద్ధమయ్యే అథ్లెట్లకు ఆర్థిక సహాయం చేసేందుకు ఓ ప్రణాళికను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా టార్గెట్ ఒలింపిక్ పోడియం(టాప్) స్కీమ్ కింద ఎంపికైన 152 మంది ఆటగాళ్లకు ఖర్చుల కింద నెలకు రూ.50వేల చొప్పున ఇస్తామని క్రీడామంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.