హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాని తొలుత భారత వాయుసేన కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ బయల్దేరడానికి ముందు టీమిండియా వీక్షించింది.
సచిన్ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ ఓ అద్భుత చిత్రమని కితాబిచ్చారు. అయితే అందరిలో కెల్లా యువరాజ్ సింగ్ ప్రశంస ప్రత్యేకంగా నిలిచింది. యువరాజ్ ట్వీట్‌కు బదులు సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది.
'సచిన్' ఎ బిలియన్ డ్రీమ్స్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
'గొప్ప వ్యక్తి. అంతకన్నా గొప్ప కథ. సచిన్: బిలియన్ డ్రీమ్స్‌ను అత్యంత కళాత్మకంగా దర్శకుడు జేమ్స్ ఎర్స్‌కిన్ దిద్దితీర్చారు. వెళ్లి చూడండి. ఇప్పుడు నేను చూస్తున్నా' భారత ఆటగాళ్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన సమయంలో యువీ ట్వీట్ చేశాడు.
యువరాజ్ ట్వీట్‌కు సచిన్ కూడా స్పందించాడు. 'థ్యాంక్స్ యువీ. నీ కథా అంతే స్ఫూర్తినిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో నీకు అదృష్టం కలిసిరావాలని, విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా' అని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. టీమిండియా గెలిచిన 2011 వరల్డ్ కప్‌లో క్యాన్సర్‌తో బాధపడుతూనే యువరాజ్ అద్భుత ప్రదర్శన చేశాడు.