బెంగుళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా మంగళవారం బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రసవత్తర మలుపులు తిరిగింది. ఈ మ్యాచ్‌పై సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు విపరీతంగా వస్తున్నాయి.
ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి జట్టును ఒంటి చేత్తో ఐపీఎల్ 9 ఫైనల్‌కు చేర్చాడు ఏబీ డివిలియర్స్. సెంచరీలు చేయడం అలవాటుగా మార్చేసుకున్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ విఫలమయ్యాడు. ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ కూడా సున్న పరుగులకే ఔటయ్యాడు.
షేన్ వాట్సన్ కూడా విఫలమైన వేళ ఏబీ డివిలియర్స్ 47 బంతుల్లో 79 పరుగులతో విధ్యంసాన్ని సృష్టించాడు. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 18.2 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో పంచ్‌లు విసిరారు, సలహాలు ఇచ్చారు.

అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ మ్యాచ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఐపీఎల్ ఫైనల్ బెర్తు సొంతమైపోయినట్లు గుజరాత్ లయన్స్ ఆటగాళ్లలో కనిపించిన ఆనందాన్ని ఎక్కువసేపు నిలకుండా చేశాడు ఏబీ డివిలియర్స్. మ్యాచ్ స్వరూపాన్నే ఒంటి చేత్తో మార్చేసిన ఆటగాడు డివిలియర్స్‌పై క్రికెట్ అభిమానులతో పాటు ప్రముఖులు కూడా ట్వీట్లు చేసారు.
కోహ్లి సేనను కంగారు పెట్టిన ధావళ్ కులకుర్ణి పుట్టినరోజు మంగళవారమే(మే 24) అన్న విషయాన్ని ఒకరు గుర్తు చేయగా, అతడు గల్లీ క్రికెట్‌లో కూడా ఇన్ని వికెట్లు తీసుండడని మరొకరు కామెంట్ చేశారు. షార్ట్ బంతులను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడుతున్న లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనాకు వాజ్ ఇట్ వెరీ షాట్? అంటూ ప్రశ్న సంధించారు.
లయన్స్ నుంచి ఏబీడీ మ్యాచ్‌ను లాగేసుకున్నాడని ప్రీతి జింతా ట్వీట్ చేసింది. కాగా ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించిన నెటిజన్లు నిన్నటి మ్యాచ్‌తో కోహ్లి పరుగుల మిషన్ కాదు మనిషేనని ట్వీట్ చేశారు. బెంగళూరు 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ షేర్లు కన్నా వేగంగా ఆర్సీబీ వికెట్లు పతనమయ్యాయని ట్వీట్ చేశారు.
మ్యాచ్ గెలిపించి విరాట్ కోహ్లి ప్రియురాలు అనుష్క శర్మను విమర్శల బారిన పడకుండా డివిలియర్స్ రక్షించాడని మరొకరు ట్వీట్ చేశారు. కోహ్లీ-డివిలియర్స్ అనుబంధం గురించి చెబుతూ వీరిద్దరి లవ్ స్టోరీ 'టైటానిక్' సినిమాను మించిపోయిందని ఇంకొరు పేర్కొన్నారు. గుజరాత్ లయన్స్ తమ థిమ్ సాంగ్‌లోని మొదటి పదాలు 'గేమ్ మారీ చె' మార్చుకోవాలని మరొకరు ట్వీట్ చేశారు.