
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్‌కు మరో పరీక్ష ఎదురుకానుంది. పర్యటనలో మొదటిగా టెస్టు సిరీస్ ఆడిన భారత్ పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు అదే గడ్డపై ఆరు వన్డేల సిరీస్‌లో ఆడనుంది. టెస్టు సిరీస్ చేజార్చుకున్న భారత్ వన్డేల్లో గెలిస్తే టాప్ 1 పొజిషన్‌లో ఉంటుంది.
దక్షిణాఫ్రికాతో ఫిబ్రవరి 1 నుంచి జరగనున్న ఆరు వన్డే సిరీస్‌లో గెలిస్తే భారత్ జట్టుకి నెం.1 ర్యాంక్ దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 119 పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. భారత వన్డే ప్రత్యర్థి దక్షిణాఫ్రికా 120 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఆ నెం.1 ర్యాంక్‌ని దక్షిణాఫ్రికా నిలబెట్టుకోవాలంటే ఈ ఆరు వన్డేల సిరీస్‌ని 3-3తో సమం చేసుకున్నా చాలు. ఒకవేళ సఫారీలు 5-1 తేడాతో టీమిండియాని ఓడిస్తే మాత్రం కోహ్లిసేన మూడో స్థానానికి పడిపోనుంది. అప్పుడు 116 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ రెండో స్థానానికి వస్తుంది.
గురువారం నుంచి జరగనున్న వన్డే సిరీస్‌ని భారత్ 4-2 తేడాతో కైవసం చేసుకోగలిగితే నెం.1 ర్యాంక్ దక్కుతుంది. కొద్ది కాలానికి ముందు ఐసీసీ విడుదల చేసిన జాబితాను బట్టి ఇప్పటికే టెస్టుల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లోనూ విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌కి మధ్య అగ్రస్థానం కోసం ఈ సిరీస్‌లో పోటీ నెలకొననుంది. కోహ్లి 876 పాయింట్లతో నెం.1 స్థానంలో ఉండగా.. తర్వాత ఏబీ డివిలియర్స్ (876), డేవిడ్ వార్నర్ (823), రోహిత్ శర్మ (816) ఉన్నారు. వన్డే మ్యాచ్‌ను బట్టే కోహ్లీ ర్యాంకు కూడా ఆధారపడి ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.