న్యూఢిల్లీ: ప్రపంచ టీ20 టోర్నీ 99శాతం టీమిండియాదేనని భారత మాజీ డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. అంతేగాక, ఇటీవల పాకిస్థాన్ జట్టు పై టీమిండియా గెలుపుపై స్పందిస్తూ.. 'పాకిస్థాన్ పాత వైన్ లాంటిది. ఒకసారి తాగితే రెండు రోజుల వరకు కిక్ దిగదు' అని చమత్కరించాడు.
పాకిస్థాన్ ఆటగాళ్లు బుల్లెట్ల కన్నా విరాట్ కోహ్లి గురించే ఎక్కువ భయపడుతున్నారని కూడా వ్యాఖ్యానించాడు. మీకు నచ్చిన ఒక పాట పాడమని అడిగితే.. ఈ షోలో క్రికెట్ గురించి మాట్లాడటానికి మాత్రమే డబ్బులిస్తున్నారని... పాటల పాడటానికి కాదని నవ్వుతూ బదులిచ్చాడు.
తొలి మ్యాచ్‌లో ధోని సేన కివీస్ చేతిలో ఓడినా.. భారత అవకాశాలకు కొదువ లేదని.. 2011 వన్డే ప్రపంచకప్‌లో సైతం తాము దక్షిణాఫ్రికా చేతిలో ఓడినా కప్ కొట్టామని అతను గుర్తు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యాతగా కొత్త అవతారం ఎత్తాడు. మైదానంలో తన దూకుడుతో బౌలర్లను బెంబేలెత్తించే వీరేంద్ర సెహ్వాగ్.. వ్యాఖ్యాతగానూ అదే జోరు కొనసాగిస్తుండటం గమనార్హం. ఆ వ్యాఖ్యలు అతని శక్తివంతమైన షాట్లలాగే ఉంటున్నాయి.
కోహ్లీకి ప్రశంసలు
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మార్చి 23న బంగ్లాదేశ్ తో ఆడనున్న మ్యాచ్‌లో భారత్ జట్టు విజయం సాధిస్తుందని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. కోల్‌కతాలోని మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన పోరాటపటిమ చూపిందని అన్నాడు.
కోహ్లీ ఇన్నింగ్స్ అద్వితీయమని చెప్పాడు. కోహ్లీ ఇన్నింగ్స్ ను తన కుమారులిద్దరూ ఆస్వాదించారని వీరూ పేర్కొన్నాడు. కోహ్లీ మంచి ప్రతిభావంతుడని చెప్పిన సెహ్వాగ్.. ఒత్తిడిలో అద్భుతంగా రాణిస్తాడని కితాబునిచ్చాడు. పాక్ విజయం క్రెడిట్ కోహ్లీదేనని సెహ్వాగ్ చెప్పాడు. టీమిండియా ఇంతకంటే మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.