
ముంబై: సునీల్ మనోహర్ గవాస్కర్. భారత క్రికెట్ జట్టు మొట్టమొదటి సూపర్‌స్టార్. స్టార్ క్రికెటర్‌గా హోదా పొందిన తొలి ఆటగాడు. బుధవారం తన 70వ పుట్టినరోజు వేడుకలను జరుపుకొంటున్నారు. మొదటిసారిగా 10 వేల పరుగుల ల్యాండ్‌మార్క్‌ను అందుకున్న క్రికెటర్‌గా రికార్డులను నెలకొల్పాడు. సాంప్రదాయక క్రికెట్‌లో 10 వేల పరుగులను అందుకోవడమనేది మామూలు విషయం కాదు. ఆధునిక క్రికెట్‌లో ఈ మైలురాయిని అందుకోవడం మంచినీళ్ల ప్రాయమే అయినప్పటికీ, దానికి బాటలు వేసింది మాత్రమే గవాస్కరే.
టెస్టుల్లో అత్యధిక సెంచరీల వీరుడిగా..
1949 జులై 10వ తేదీన జన్మించిన సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును బద్దలు కొట్టడానికి రెండు దశాబ్దాలు పట్టిందంటే.. ఆయన ఆటతీరు ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలను నమోదు చేసిన ఏకైక క్రికెటర్‌గా 20 ఏళ్లకు పైగా ఆయన రికార్డు పదిలంగా కొనసాగింది. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకొనే సమయానికి సునీల్ గవాస్కర్ 34 సెంచరీలను సాధించారు. ముంబైకే చెందిన సచిన్ టెండుల్కర్ 2010 ఈ రికార్డును చెరిపేశారు. 34 సెంచరీల రికార్డును అధిగమించాడు. 125 టెస్ట్ మ్యాచ్‌లను ఆడిన గవాస్కర్ 10122 పరుగులు చేశారు. అత్యధిక స్కోరు 236. బ్యాటింగ్ సగటు 51.1. 45 అర్ధసెంచరీలను చేశాడు.
వన్డేల్లో ఒకే ఒక్కటి..
1983 ప్రపంచకప్‌ను సాధించిన భారత క్రికెట్ జట్టులో భాగస్వామి గవాస్కర్. గవాస్కర్ వన్డే కేరీర్‌లో ఒకే ఒక్క సెంచరీ నమోదైంది. ఆయన అత్యధిక స్కోరు 103. 108 మ్యాచ్‌ల్లో 102 ఇన్నింగులను ఆడిన ఆయన 3092 పరుగులు చేశారు. ఇందులో 27 అర్ధసెంచరీలు ఉన్నాయి. తన ఏకైక వన్డే సెంచరీని ఆయన ఇంగ్లండ్‌పై సాధించారు. 1987లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సునీల్ గవాస్కర్ ప్రస్తుతం కామెంటర్‌గా తన రెండో ఇన్నింగ్‌ను కొనసాగిస్తున్నారు.