
దేశంలో ఈ మధ్య కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత మూడో రోజులుగా ప్రతిరోజూ 20 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఈ మహమ్మారి క్రికెట్ ఆటగాళ్లను కూడా తాకింది. ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫి కోసం సిద్దమవుతున్న ఆటగాళ్లపై దాడి చేసింది. వైరస్ దెబ్బకు బెంగాల్ జట్టులోని ఏడుగురికి, ముంబై జట్టులోని ఒకరికి పాజిటివ్‌గా తేలింది. కరోన బారిన పడిన వారిలో బెంగాల్ జట్టులో ఆరుగురు ఆటగాళ్లు కాగా, ఒకరు కోచింగ్ సిబ్బంది ఉన్నారు. సురజిత్ యాదవ్, సుదీప్ ఛటర్జీ, అనుస్తుప్ మజుందార్, గీత్ పూరి, ప్రదీప్త ప్రమాణిక్, కాజీ జునైద్ సైఫీ కరోనా బారిన పడిన ఆటగాళ్లు కాగా.. మాజీ క్రికెటర్, కోచింగ్ సిబ్బంది అయిన సౌరశిష్ లాహిరి కూడా ఉన్నాడు. అలాగే ముంబై జట్టు ఆల్‌రౌండర్ శివమ్ దూబెకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. వీళ్లందరికీ నేడు ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్దారణ అయింది. కరోనా బారిన పడిన బెంగాల్ ఆటగాళ్లతోపాటు కోచింగ్ స్టాఫ్ ఆదివారం సాల్ట్ లేక్‌లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ సెకండ్ క్యాంపస్ గ్రౌండ్‌లో నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం కరోనా బారిన పడిన వారందరినీ క్వారంటైన్‌కు తరలించి చికిత్స చేస్తున్నారు.
బెంగాల్ జట్టు తమ తొలి మ్యాచ్‌ను ఈ నెల 13న త్రిపురతో ఆడాల్సి ఉంది. అయితే ఆ జట్టులో కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో మ్యాచ్ అనుకున్న టైమ్‌కు ప్రారంభవం అవడంపై అనుమానాలు నెలకొన్నాయి. బెంగాల్ జట్టు ఈ రంజీ టోర్నీలో త్రిపురతోపాటు హర్యాణా, కేరళ, రాజస్థాన్, విదర్భలతో ఆడాల్సి ఉంది. దీనికంటే ముందు షెడ్యూల్ ప్రకారం పృథ్వీ షా నేతృత్వంలోని ముంబై జట్టుతో ఓ వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. కాగా కరోనా బారిన పడ్డ ముంబై ఆల్‌రౌండర్ శివమ్ దూబె స్థానంలో సైరాజ్ పాటిల్‌ను జట్టులోకి తీసుకున్నారు.
కరోనా బారిన పడిన ఆటగాళ్లందరికీ చికిత్స అందిస్తున్నట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. అంతేకాకుండా మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిపై సమీక్షించాలని నిర్ణయించింది. అలాగే కరోనా వ్యాప్తి దృష్యా ప్రస్తుతం జరుగుతున్న స్థానిక టోర్నమెంట్లు అన్నింటిని బెంగాల్ క్రికెట్ బోర్డు వాయిదా వేసింది. అంతేకాకుండా అవరసమైన మేర ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు విధించింది.