
లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోని ఏడు ఫ్రాంచైజీలు కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాయి. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడనున్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల కోసం స్పెషల్ ఛార్టర్డ్ ప్లైట్‌ని యూఏఈ నుంచి పంపబోతున్నాయి. ఇంగ్లండ్ గడ్డపై ప్రస్తుతం ఈ రెండు జట్లు టీ20, వన్డే సిరీస్‌లో తలపడుతున్నాయి. మాంచెస్టర్ వేదికగా సెప్టెంబరు 16న చివరి మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే.. అక్కడి నుంచి నేరుగా యూఏఈకి ప్రత్యేక ఛార్టర్డ్ ప్లైట్‌లో ఇరు జట్ల క్రికెటర్లు రానున్నారు.
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు చెందిన క్రికెటర్లు చాలా మంది ఐపీఎల్ 2020లో ఆడనున్నారు. ఒకవేళ ఆటగాళ్లు కమర్షియల్ ప్లైట్‌లో యూఏఈకి వస్తే.. మళ్లీ వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుంది. అలా అయితే ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకి ఆ రెండు జట్ల క్రికెటర్లు దూరం కానున్నారు. ఆయా ప్రాంచైజీలకు చెందిన కీలక ఆటగాళ్లు మిస్ అవుతారనే ఆలోచనతో బీసీసీఐతో చర్చలు జరిపారు. ఆటగాళ్ల కోసం స్పెషల్ ఛార్టర్డ్ ప్లైట్‌ని పంపేందుకు ఫ్రాంఛైజీలు మొగ్గుచూపాయి.
బీసీసీఐతో 7 ప్రాంచైజీలు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో 22 మంది ఆటగాళ్లు స్పెషల్ ఛార్టర్డ్ ప్లైట్‌లో మాంచెస్టర్ నుంచి యూఏఈ చేరుకోనున్నారు. ఛార్టర్డ్ ప్లైట్ ధర సుమారు లక్ష పౌండ్లు అని తెలుస్తోంది. స్టీవ్ స్మిత్ (రాజస్థాన్ రాయల్స్), డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), అరోన్ ఫించ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), ఇయాన్ మోర్గాన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్ ), పాట్ కమిన్స్ (కోల్‌కతా నైట్‌రైడర్స్), జోప్రా ఆర్చర్ (రాజస్థాన్ రాయల్స్) వంటి స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ 2020లో ఆడనున్నారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లని మాంచెస్టర్ నుంచి తరలించే ఛార్టర్డ్ ప్లైట్‌ని పూర్తిగా శానిటైజ్ చేయనున్నారు. ఆ ప్లైట్ దుబాయ్‌లోని ఎయిర్‌ఫోర్ట్‌లో కాకుండా మరొక విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వనుంది. అక్కడి నుంచి టోర్నీలోని ఫ్రాంఛైజీలు.. తమ ఆటగాళ్లని ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రస్తుతం బయో బబుల్‌లోనే సిరీస్ ఆడుతుండటంతో.. వారిని నేరుగా ఐపీఎల్ బబుల్‌లోకి చేర్చనున్నారు. వారికి క్వారంటైన్ లేదు. ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన ఏ ఒక్క ఆటగాడు కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీంలో లేరు కాబట్టి ఆ జట్టు ప్లైట్ కోసం డబ్బులు చెల్లించలేదు.