T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌కి వేదికలు ఖరారు.. మెల్‌బోర్న్‌లో నవంబర్ 13న ఫైనల్!!

మెల్‌బోర్న్: యూఏఈ, ఒమన్ వేదికగా రెండు రోజుల క్రితం టీ20 ప్రపంచకప్ 2021 ముగిసిన విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా ఆవిర్భవించింది. ఇక మరో మెగా సమరం కూడా త్వరలోనే జరగనుంది. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేళ్లకు ఒకసారి టీ20 ప్రపంచకప్ నిర్వహిస్తోంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా టోర్నీలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో ఏడాదిలోనే ఇంకో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఆస్ట్రేలియా మెగా పోటీలకు ఆతిథ్యమిస్తోంది. వచ్చే ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరిగే ఈ టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారులు ఖరారు చేశారు.

ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న మెల్‌బోర్న్
మొత్తం ఏడు నగరాల్లో టీ20 ప్రపంచకప్ 2022 నిర్వహించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు మంగళవారం వెల్లడించారు. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు మొత్తం 45 మ్యాచ్‌లు నిర్వహించనుండగా.. వాటికి అడిలైడ్, బ్రిస్బేన్, గీలాండ్, హోబార్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీ నగరాలను వేదికలుగా ఖరారు చేశారు. ఇందులో మెల్‌బోర్న్ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. సిడ్నీ, అడిలైడ్‌లలో సెమీస్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఈ ఏడాది భారత్‌లో జరగాల్సిన మెగా టోర్నీ.. కరోనా కారణంగా యూఏఈ, ఒమన్ వేదికల్లో బీసీసీఐ ఆధ్వర్యంలోనే జరిగిన విషయం తెలిసిందే.

లైనప్‌లో 12 జట్లు
'ఆస్ట్రేలియాలో మళ్లీ ఐసీసీ టోర్నీలు జరగడం చాలా సంతోషంగా ఉంది. వాటి నిర్వహణ కోసం మేం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఏడు నగరాలు ఆతిథ్యమివ్వబోతున్నాయి. అడిలైడ్, బ్రిస్బేన్, గీలాండ్, హోబార్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీ నగరాలను వేదికలుగా ఖరారు చేశాం. 2020లో మహిళల టీ20 ప్రపంచకప్ నిర్వహించాక రెండేళ్ల తర్వాత పటిష్ఠ కార్యాచరణతో స్థానిక అధికారులతో కలిసి ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం' అని ఐసీసీ టోర్నీల పర్యవేక్షకుడు క్రిస్ టెట్లీ ఓ ప్రకటనలో తెలిపారు. టీ20 ప్రపంచకప్ కోసం 12 జట్లు లైనప్‌లో ఉన్నాయని, క్వాలిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు వేచి ఉండాల్సి ఉందని టెట్లే చెప్పారు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు నేరుగా
ఆదివారం పూర్తయిన టీ20 ప్రపంచకప్ 2021లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్లో తలపడగా.. ఈ రెండు జట్లూ నేరుగా సూపర్-12లో అడుగుపెడతాయి. మరోవైపు అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు టాప్-8 ర్యాంకుల్లో ఉన్నందున ఈ జట్లు కూడా సూపర్-12కు నేరుగా చేరుకుంటాయి. శ్రీలంక, వెస్టిండీస్ జట్లు మాత్రం మిగతా చిన్న జట్లతో అర్హత పోటీల్లో తలపడతాయి.
ఈ అర్హత పోటీలను రెండు దశల్లో నిర్వహిస్తుండగా.. తొలుత ఫిబ్రవరిలో ఒమన్‌లో ఒక టోర్నీ, తర్వాత జూన్‌లో జింబాబ్వేలో మరో టోర్నీ నిర్వహించనున్నారు. గతేడాది జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియానే ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్ఫూర్తితోనే మరో ప్రతిష్ఠాత్మక టోర్నీని నిర్వహించేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications