క్రికెట్.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దాదాపుగా ప్రతిఒక్కరూ ఈ ఆటను ఇష్టపడేవారే. సమయం దొరికినప్పుడల్లా ఆడుతూనే ఉంటారు. అలా అప్పుడప్పుడు మనం అసాధారణమైన క్రికెట్ టాలెంట్ ఉన్న యువత, చిన్న పిల్లలను చూస్తూనే ఉంటాం. అద్భుతంగా బౌలింగ్ వేస్తూ, బ్యాటింగ్ చేస్తూ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంటారు. తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఓ ఆరేళ్ల చిన్నారి కూడా అదిరే స్టైల్ లో బ్యాటింగ్ చేసి క్రికెట్ అభిమానులను ఆకర్షించింది. అది కూడా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టైల్ లో షాట్లు బాదుతూ అలరించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఆకట్టుకుంటోంది.
ఆ చిన్నారి ఎవరంటే?
వీడియోలో షాట్లు బాదే చిన్నారి పేరు సోనియా ఖాన్. పాకిస్థాన్‌కు చెందిన ఈ బుడతది వయసు ఆరేళ్లు. ఈ చిన్నారి క్రీజులో నిలబడి, అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్‌తో కాన్ఫిడెంట్‌గా రోహిత్ శర్మ ఐకానిక్ పుల్ షాట్‌ను బాదటం.. అభిమానులను తెగ ఆకట్టుకుంది. అది కూడా టైమింగ్ చూసి మరీ షాట్లు బాదుతుంటే.. అది చూసిన క్రికెట్ అభిమానులు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. యువతకు, చిన్నపిల్లలకు.. క్రికెట్ పట్ల ఉన్న ప్యాషన్ కు ఇది నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు.
సోనియా కంటిన్యూస్‌గా లాంగ్ ఆన్ దిశగా, కవర్స్ దిశగా పవర్ ఫుల్ షాట్లు బాదడం, లాఫ్టెడ్ షాట్లు కొట్టడం చూసి దిగ్గజ క్రికెటర్లతో ఆమెను పోలుస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది.. రోహిత్ శర్మ వింటేజ్ పుల్ షాట్‌లా ఉందని అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ చిన్నారికి సరైన మార్గదర్శకత్వం సహా ఇతర సహాయ వనరులు ఉంటే భవిష్యత్ లో గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతుందని ప్రశంసిస్తున్నారు. ఆమెకు సహాయసహకారాలు అందాలని కోరుకుంటున్నారు.
