ఆసియా కప్ 2025లో పాకిస్థాన్ యువ ఓపెనర్ సైమ్ ఆయుబ్ ఘోరంగా విఫలమయ్యాడు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఒమన్ జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాకిస్థాన్ జట్టుకు కష్టాలు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా తొలి ఓవర్లోనే పాకిస్థాన్ కు భారీ షాక్ తగిలింది. యువ, విధ్వంసకర ఓపెనర్ సైమ్ ఆయుబ్ తొలి బంతికే వెనుదిరిగాడు.
సైమ్ ఆయుబ్ గోల్డెన్ డకౌట్
23 ఏళ్ల సైమ్ ఆయుబ్, ఒమన్‌తో మ్యాచ్‌లో క్రీజులోకి రాగానే భారీ షాట్ ఆడాలని ప్రయత్నించాడు. అయితే ఓవర్లో రెండో బంతిని బౌలర్ షా ఫైసల్ వేయగా.. దాన్ని స్లాగ్ చేయడానికి ప్రయత్నించి పూర్తిగా మిస్ అయ్యాడు. దీంతో బంతి అతని ప్యాడ్స్‌కు తగిలింది. ఓమన్ జట్టు వికెట్ కోసం గట్టిగా అప్పీల్ చేయగా.. అంపైర్ ఆయుబ్‌ను ఔట్‌గా ప్రకటించారు.

ఒమన్ బౌలర్ షా ఫైసల్ పాకిస్థాన్ మూలాలు ఉన్న ఆటగాడు కావడం గమనార్హం. షా ఫైసల్ పాకిస్తాన్‌లోని దిర్ లో జన్మించినప్పటికీ, ఒమన్ తరఫున తన మాతృదేశానికి వ్యతిరేకంగా ఆడుతున్నాడు. సైమ్ ఆయుబ్ ఒక చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు. సెప్టెంబర్ 14న భారత్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు.. అతను పరుగులేమీ చేయకపోవడం జట్టుపై ఒత్తిడి పెంచుతుంది.
పాకిస్తాన్ మాజీ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ ఇటీవల ఒక సంచలన వ్యాఖ్య చేశారు. సెప్టెంబర్ 14న జరిగే మ్యాచ్‌లో సైమ్ ఆయుబ్, ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో 6 సిక్సులు కొడతాడని ఆయన అన్నారు. అయితే, ఒమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఆయుబ్ డకౌట్ కావడంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.
కెప్టెన్ సల్మాన్ ఆఘా కూడా విఫలం
సైమ్ ఆయుబ్ మాత్రమే కాకుండా, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా పరిస్థితి కూడా అలాగే ఉంది. సల్మాన్ కూడా మొదటి బంతికే ఔట్ అయ్యాడు. అమీర్ కలీమ్ వేసిన బంతిని భారీ షాట్ ఆడాలని ప్రయత్నించి, నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి కొట్టాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తరఫున మహ్మద్ హారిస్ మాత్రమే అద్భుతంగా రాణించాడు. హారిస్ 43 బంతుల్లో 66 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. సాహిబ్జాదా ఫర్హాన్ 29 పరుగులు చేశాడు, కానీ అతను ఈ పరుగులు చేయడానికి 29 బంతులు తీసుకున్నాడు.
జట్ల వివరాలు:
పాకిస్తాన్: సామ్ ఆయుబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముకీమ్, అబ్రార్ అహ్మద్.
ఒమన్: జతీందర్ సింగ్ (కెప్టెన్), ఆమిర్ కలీమ్, హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), షా ఫైసల్, హస్నైన్ షా, మహ్మద్ నదీమ్, జిక్ర్రియా ఇస్లాం, సుఫియాన్ మెహమూద్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ.