భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. మహ్మద్ సిరాజ్ వంటి యువ బౌలర్లను ప్రోత్సహించే ప్రక్రియలో ఇషాంత్ భారత జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. శతక టెస్టుల ధీరుడిగా రికార్డు సాధించిన ఇషాంత్ చివరిగా 2021లో ఇండియా తరఫున ప్రాతినిథ్యం వహించాడు.
అయితే వచ్చే నెల నుంచి స్వదేశంలో టెస్టు సందడి మొదలుకానుండటంతో 35 ఏళ్ల ఇషాంత్ భారత జట్టులో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. టీమిండియాలో తిరిగి చోటు దక్కించుకుని అంతర్జాతీయ క్రికెట్‌కు ఘనంగా ముగింపు పలకాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లోనూ యువ ప్లేయర్లతో కలిసి ఈ ఆరు అడుగుల పేసర్ ఆడనున్నాడు.

ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో 'పురానీ ఢిల్లీ 6' జట్టులో రిషభ్ పంత్‌తో కలిసి ఇషాంత్ శర్మ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఇషాంత్ యువ క్రికెటర్లకు కొన్ని సూచనలు అందించాడు. ''ఢిల్లీ ప్రీమియర్ లీగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఢిల్లీలో ఈ లీగ్ తొలిసారి ప్రారంభం కానుంది. యువ క్రికెటర్లకు ఇచ్చే సందేశం ఒక్కటే.. శ్రమించండి, మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి''
''ఈ ఫార్మాట్‌లో కొన్నిసార్లు ఊహించని ఫలితాలు ఎదురవుతాయి. కానీ శ్రమిస్తూ, మన నైపుణ్యంపై నమ్మకం ఉంచితే ఏ ఫార్మాట్‌లో అయినా సత్తాచాటగలం. ఇక పంత్‌తో కలిసి ఎంతోకాలంగా ఆడుతున్నా. అతనితో కలిసి ఆడటం సంతోషంగా ఉంది'' అని ఇషాంత్ శర్మ అన్నాడు. భారత్ తరఫున ఇషాంత్ 105 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 311, వన్డేల్లో 115,పొట్టి ఫార్మాట్‌లో 8 వికెట్లు పడగొట్టాడు.
భారత్ సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఇషాంత్‌కు గౌరవ ముగింపు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తే.. బంగ్లాదేశ్ లేదా న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో ఇషాంత్ ఆడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమితో పేస్ త్రయం పటిష్టంగా ఉంది. అయితే శస్త్రచికిత్స చేయించుకున్న షమి బంగ్లా లేదా కివీస్ సిరీస్‌కు పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోతే ఇషాంత్‌కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.