పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాపై భారత్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. బ్యాటింగ్‌లో ప్రధానంగా విఫలమై 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సిరీస్‌లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది.
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో టీమిండియా నిలవాలంటే అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని తప్పక గెలవాలి. ఈ కీలక సమయంలో ప్రధాన బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విఫలమవ్వడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రెండో టెస్టులోనే కోహ్లి తడబడలేదని, టెస్టుల్లో ఫామ్ కోల్పోయి అయిదేళ్లు గడిచిందని వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ఆండీ రాబర్ట్స్ అన్నాడు. కోహ్లి పేరును నేరుగా ప్రస్తావించకుండా ప్రధాన బ్యాటర్ అని సంబోధించాడు. అలాగే అడిలైడ్ టెస్టులో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని తప్పుబట్టాడు.

''అడిలైడ్ టెస్టు ఓటమి తర్వాత టీమిండియా పుంజుకుంటుందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే, బ్యాటింగ్‌లో మాత్రం తప్పక పురోగతి సాధించాలి. భారత ప్రధాన బ్యాటర్లలో ఒకరు గత అయిదేళ్లుగా కష్టపడుతున్నాడు. అతను తన ఆట సుదీర్ఘ సంస్కరణపై దృష్టిపెట్టాలి. సుదీర్ఘమైన ఫామ్‌పై పూర్తిగా దృష్టిసారించినప్పుడే టెస్టుల్లో పరుగులు, భారీ స్కోరులు చేయగలం. టెస్టు క్రికెట్ ప్రమాణాలు అలాగే లేదు. టాప్ బ్యాటర్ ఇబ్బంది పడుతున్నాడని కనిపిస్తుంది''
''ఇక అడిలైడ్‌లో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎందుకు ఎంచుకుంది. పెర్త్‌లో ఆస్ట్రేలియాను భారత ఫాస్ట్ బౌలర్లు తక్కువస్కోరుకే ఆలౌట్ చేశారు (104 & 238). మా ఫాస్ట్ బౌలర్లు ఇదే తరహాలో ఆలౌట్ చేస్తే, తర్వాతి టెస్టులో ప్రత్యర్థికి బౌలింగ్ ఇస్తూ అవకాశం ఇవ్వను. భారత పిచ్‌లపై ఆడట్లేదనే విషయాన్ని టీమిండియా గుర్తుంచుకోవాలి'' అని రోబర్ట్స్ పేర్కొన్నాడు.
ఈ ఏడాది విరాట్ కోహ్లి 16 ఇన్నింగ్స్‌ల్లో 26.64 సగటుతోనే పరుగులు చేశాడు. కనీసం 10 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన క్యాలెండర్ ఇయర్‌లలో కోహ్లి అత్యల్ప టెస్టు సగటు ఈ ఏడాదే నమోదైంది. 2020 నుంచి కోహ్లి మూడు సెంచరీలు మాత్రమే చేశాడు. పెర్త్ టెస్టులో అజేయ సెంచరీ చేసిన కోహ్లి అడిలైడ్ టెస్టులో 7, 11 పరుగులు చేశాడు. కాగా, గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.