హైదరాబాద్: ధర్మశాల వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న చివరి టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ దూకుడుగా ఆడుతున్నాడు. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ చివరి టెస్టులో కూడా సెంచరీ నమోదు చేశాడు.
స్టీవ్ స్మిత్‌కు ఈ సిరీస్‌లో ఇది మూడవ సెంచరీ కావడం విశేషం. పూణె టెస్టులో 109, రాంచీ టెస్టులో 178 నాటౌట్, ప్రస్తుతం ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 111 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. టెస్టుల్లో స్మిత్‌కు ఇది 20వ సెంచరీ.

ధర్మశాల టెస్టులో స్మిత్ కేవలం 152 బంతుల్లో 13 ఫోర్ల సహాయంతో సెంచరీ పూర్తి చేశాడు. భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లో మూడు సెంచరీలు కొట్టిన మూడవ ఆతిథ్య జట్టు కెప్టెన్‌గా స్మిత్ రికార్డు సృష్టించాడు. దీంతో పాటు 2004లో భారత్‌లో జరిగిన సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు డామియన్ మార్టిన్ చేసిన 440 పరుగుల రికార్డును కూడా స్మిత్ చెరిపేశాడు.
తన కెరీర్‌లో 54 టెస్టులు ఆడిన స్మిత్ 20 సెంచరీలు చేశాడు. కాగా, ధర్మశాల టెస్టులో 60 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా 208 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో వేడ్ 13, కమ్మిన్స్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.