చెన్నై: అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కున్నప్పటికీ డివిల్లీర్స్ దక్షిణాఫ్రికాను ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. భారత్‌పై గురువారం జరిగిన నాలుగో వన్డే మ్యాచులో దక్షిణాఫ్రికా 35 పరుగులతో ఓడిపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో సఫారీలు 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 299 పరగులు చేసి దక్షిణాఫ్రికాకు సవాల్ విసిరింది. ఈ విజయంతో భారత్ ఐదు వన్డేల సిరీస్‌ను 2-2 స్కోరుతో సమం చేసింది. దీంతో ఐదో వన్డే కీలకం కానుంది.
భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీసుకోగా, హర్భజన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్, మోహిత్ శర్మ, అమిత్ మిశ్రా తలో వికెట్ తీసుకున్నారు. డివిల్లీర్స్ 112 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా ఓటమి ఖరారైంది.
300 పరుగుల భారీ లక్ష్య ఛేదన క్రమంలో దక్షిణాఫ్రికా 36 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. మోహిత్ శర్మ బౌలింగులో హషీం ఆమ్లా 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. 67 పరుగుల వద్ద దక్షిణాప్రికా రెండో వికెట్ కోల్పోయింది. హర్భజన్ బౌలింగులో డీకాక్ 43 పరుగులు చేసి అవుటయ్యాడు. 79 పరుగుల స్కోరు వద్ద మూడో సఫారీ వికెట్ పడింది. అక్షర్ పటేల్ చేతిలో డూ ప్లెసిస్ 17 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు.
స్పిన్ మంత్రజాలం పనిచేసింది. దక్షిణాఫ్రికా 88 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. మిల్లర్ ఆరు పరుగులు చేసి హర్భజన్ బౌలింగులో అవుటయ్యాడు. 144 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. బెహర్దీన్ 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అమిత్ మిశ్రా బౌలింగులో అవుటయ్యాడు. ఈ సమయంలో విజయానికి 18.1 ఓవర్లలో 156 పరగుులు చేయాల్సిన స్థితిలో సఫారీలు పడ్డారు.
185 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. మోరిస్ 9 పరగుుల వద్ద రన్నవుటయ్యాడు. డీవిల్లీర్స్ ఒంటరి పోరు చేస్తున్నాడు. అతను సెంచరీ చేశాడు. అతనికి ఇది వన్డేల్లో 22వ సెంచరీ. 233 పరుగుల స్కోర్ వద్ద ఏడో వికెట్‌గా డివిల్లీర్స్ అవుటయ్యాడు. దక్షిణాఫ్రికా 250 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది.
నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత్ 8 వికెట్ల నష్టానికి నిర్ణీత 50 ఓవర్లలో 299 పరుగులు చేసింది. విజయానికి దక్షిణాప్రికా 300 పరుగులు చేయాల్సి ఉంటుంది. విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ (138), సురేష్ రైనా అర్థ సెంచరీ (53)లకు తోడు రహనే బ్యాటింగ్ (45) భారత్ భారీ స్కోరు సాధించగలిగింది.దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్, రబడ మూడేసి వికెట్లు తీసుకోగా, మోరిస్ ఒక్క వికెట్ తీశాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇరవై ఒకటో ఓవర్లో మొదటి బంతికి సింగిల్ తీసి హాఫ్ సెంచరీ చేశాడు. 51 బంతుల్లో చేశాడు. ఆ తర్వాత కోహ్లీ సెంచరీ సాధించాడు. ఇది ఆయనకు వన్డేల్లో 23వ సెంచరీ. 291 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ రబడ బౌలింగులో అవుటయ్యాడు. కోహ్లీ 140 బంతుల్లో 138 పరుగులు చేశాడు. ఆ తర్వాత వెంటనే రబడ హర్బజన్ సింగ్ వికెట్ తీసుకున్నాడు. దీంతో భారత్ 291 పరుగుల వద్ద ఆరు వికెట్లు కోల్పోయింది. 299 పరుగుల వద్ద ధోనీ (15 పరుగులు) ఏడో వికెట్‌గా స్టెయిన్ బౌలింగులో అవుటయ్యాడు.

కాగా, టీమిండియా ఇరవై ఓవర్లకు 105 పరుగులు చేసింది. రెండు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు 16 ఓవర్లకు 86 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ 50, రహానే 25 పరుగులతో ఉన్నారు.
శిఖర్ ధావన్ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రబాడా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రిస్ మోరీస్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (21) డుప్లెసిస్‌కి క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.

చెన్నై వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన నాలుగో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ జట్టులో ఎలాంటి మార్పు చోటుచేసుకుండా బరిలోకి దిగింది.

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా చెన్నైలోని ఎమ్. చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పని సరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దక్షిణాఫ్రికా 2-1 తేడాతో ముందంజలో ఉంది.
గాయాల కారణంగా మోర్నీ మోర్కెల్, జేపీ డుమిని నాలుగో వన్డేకు దూరమయ్యారు. వీరిద్దరి స్ధానంలో క్రిస్ మోర్రిస్, ఆరోన్ తుది జట్టులో స్థానం సంపాదించారు. రాజ్‌కోట్ వన్డేలో ధోని స్ట్రెయిట్ డ్రైవ్‌ను అడ్డుకునే ప్రయత్నంలో డుమిని చేతికి గాయమైన సంగతి తెలిసిందే.

కాన్పూర్, రాజ్‌కోట్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా, ఇండోర్‌లో జరిగిన వన్డేలో టీమిండియా గెలిచింది. వన్డే సిరిస్ అనంతరం భారత్-దక్షిణాఫ్రికాల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది.
జట్టు వివరాలు:
ఇండియా: మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, అక్షర పటేల్, అజింక్య రహానే, సురేష్ రైనా, మోహిత్ శర్మ, రోహిత్ శర్మ, అమిత్ మిశ్రా, హర్భజన్ సింగ్.
సౌత్ ఆఫ్రికా: ఏబీ డివిలియర్స్ (కెప్టెన్), హషీమ్ ఆమ్లా, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఫాఫ్ డు ప్లెసిస్, డేవిడ్ మిల్లర్, ఫర్హాన్, క్రిస్ మోరిస్, ఆరోన్ ఫంగ్సో, ఇమ్రాన్ తాహిర్, డేల్ స్టెయిన్, కగిసో రబాడ.