హైదరాబాద్: కొలంబో వేదికగా జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఆతిథ్య శ్రీలంకను 168 పరుగుల తేడాతో ఓడించింది. 376 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో 42.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌట్ అయింది.
శ్రీలంక జట్టులో ఏంజెలో మాథ్యూస్ (70) ఫరవాలేదనిపించాడు. భారత బౌలర్లలో బుమ్రా, పాండ్యా, కుల్దీప్ రెండేసి వికెట్లు తీశారు. అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 375 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య శ్రీలంకకు 376 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
తన కెరీర్‌లో 300వ వన్డే ఆడుతున్న ధోని ఈ మ్యాచ్‌లో మునుపటి ధోనిని తలపించాడు. కేఎల్ రాహుల్ (7) పరుగుల వద్ద అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని శ్రీలంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. బంతిని బౌండరీలకు తరలిస్తూ తనదైన శైలిలో ఆడాడు.
ఈ క్రమంలో మరో ఎండ్‌లో ఉన్న మనీష్ పాండే కూడా చక్కగా ఆడాడు. ఇద్దరూ కలిసి స్కోరు బోర్డుని పరిగెత్తించారు. మనేశ్ పాండే 42 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో (50 నాటౌట్) నిలవగా, ధోని 42 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 49 పరుగులు (నాటౌట్) చేసి హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు.
భారత్ ఇన్నింగ్స్ సాగిందిలా:
300 పరుగుల మైలురాయిని దాటిన భారత్ స్కోరు
శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా 300 పరుగుల మైలురాయిని దాటింది. ఓపెనర్ రోహిత్ శర్మ (104), కెప్టెన్ కోహ్లీ (131) చెలరేగడంతో 43 ఓవర్లలోనే టీమిండియా 300 పరుగుల మార్కుని అందుకుంది. ప్రస్తుతం 43 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. మనీష్ పాండే 21, ధోనీ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.
క్రీజులో ధోని
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుుతన్న నాలుగో వన్డేలో శ్రీలంక బౌలర్లు సత్తా చాటుతున్నారు. 225/2తో పరుగులతో పటిష్టంగా ఉన్న టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయి 274/5కు చేరింది. దీంతో 40 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (7) అవుటైన తర్వాత క్రీజులోకి ధోని వచ్చాడు. ధోనికి ఇది 300వ వన్డే కావడం విశేషం. ప్రస్తుతం మనీశ్ పాండే (8), ధోని (3) పరుగులతో క్రీజులో ఉన్నారు.

సెంచరీ చేసి అవుటైన రోహిత్ శర్మ
శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 262 పరుగుల వద్ద వరుసగా టీమిండియా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. మాథ్యూస్ వేసిన 35 ఓవర్ మూడో బంతికి హార్థిక్ పాండ్యా (19) అవుటవగా, నాలుగో బంతికి రోహిత్ శర్మ (104) అవుటయ్యాడు. ఇన్నింగ్స్ 35వ ఓవర్ వేసిన మాథ్యూస్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ పేలవ షాట్‌తో వికెట్ చేజార్చుకున్నాడు.
ఆఫ్ స్టంప్ మీదుగా బౌన్సర్ రూపంలో మాథ్యూస్ విసిరిన బంతిని అప్పర్ కట్ ద్వారా.. థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి తరలించేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించాడు. అయితే.. బంతి బ్యాట్ అంచున తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ డిక్వెల్లా చేతుల్లో పడింది. ప్రస్తుతం 35 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్, మనీష్ పాండే పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.
13వ సెంచరీ చేసిన రోహిత్ శర్మ
శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 19వ అర్ధసెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో 88 బంతుల్లోనే రోహిత్ శర్మ 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఇదే మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ కూడా మెరుపు సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 219 పరుగులు జోడించారు. వన్డేల్లో రెండు వందలకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పడం వీరికిది మూడోసారి. విరాట్ కోహ్లీ 131 పరుగుల వద్ద అవుట్ కాగా, రోహిత్ శర్మ సెంచరీ అనంతరం 104 పరుగుల వద్ద అవుటయ్యాడు.
రెండో వికెట్ కోల్పోయిన భారత్
శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 131 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్ కోహ్లీ... మలింగ బౌలింగ్‌లో మునవీరకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కోహ్లీ అవుటైన తర్వాత పాండ్యా క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (90), హార్ధిక్ పాండ్యా (1) పరుగుతో క్రీజులో ఉన్నారు.
29వ సెంచరీని నమోదు చేసిన కోహ్లీ
శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ సెంచరీ సాధించాడు. 76 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 100 పరుగులను నమోదు చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 29వ సెంచరీ కావడం విశేషం. వన్డేల్లో సచిన్ 49, రికీ పాంటింగ్ 30 తర్వాత 29 సెంచరీలతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక లంకపై 44 ఇన్నింగ్స్‌లోనే 2000 పరుగులు చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ జోడీ 200కి పైగా భాగస్వామ్యం చేయడం ఇది మూడోసారి. 150కి పైగా పరుగులు చేయడం ఎనిమిదో సారి. ధావన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ వరుస బౌండరీలతో శ్రీలంక బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మ కూడా చెలరేగి ఆడుతున్నాడు. ప్రస్తుతం 25 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి భారత్ 187 పరుగులు చేసింది. కోహ్లీ 102, రోహిత్ 77 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మలు దూకుడుగా ఆడుతున్నారు. వరుస బౌండరీలతో శ్రీలంక బౌలర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఈ క్రమంలో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకుని సెంచరీవైపు దూసుకెళ్తుండగా రోహిత్ శర్మ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో రోహిత్ శర్మ 50 పరుగులు చేశాడు. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ కలిసి 105 బంతుల్లో 138 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం 19 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి భారత్ 144 పరుగులు చేసింది. కోహ్లీ 81, రోహిత్ 55 పరుగులతో క్రీజులో ఉన్నారు.

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ
శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 38 బంతుల్లోనే 9 ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ధావన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ వచ్చీ రావడంతోనే వరుస బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు. మలింగ వేసిన 10.5వ బంతినిసింగిల్ తీసి కెరీర్‌లో 45వ హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. కోహ్లీ 51, రోహిత్ శర్మ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కోహ్లీ వరుస బౌండరీలు
శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుస బౌండరీలతో చెలరేగుతున్నాడు. పేసర్ మలింగ వేసిన నాలుగో ఓవర్‌లో 13 పరుగులు పిండుకున్నాడు. రెండు, మూడు, నాలుగు బంతుల్లో హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు. కోహ్లీకి తోడుగా రోహిత్ శర్మ (3) నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (3), కెప్టెన్ విరాట్ కోహ్లీ (20) పరుగులతో క్రీజులో ఉన్నారు.

6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన భారత్
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నాలుగో వన్డేలో రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 6 పరుగుల వద్ద ధావన్ (4) అవుటయ్యాడు. ఫెర్నాండో వేసి రెండో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ శిఖర్ ధావన్(4) పుష్పకుమారకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఫలితంగా ఆరు పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (3), కెప్టెన్ విరాట్ కోహ్లీ (2) పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ
ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య గురువారం నాలుగో వన్డే ప్రారంభమైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ వన్డేకి ఓ ప్రత్యేకత ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇది 300వ వన్డే కావడం విశేషం.
కెరీర్‌లో 300వ వన్డే ఆడుతోన్న మహేంద్ర సింగ్ ధోనీకి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక జ్ఞాపిక అందజేశాడు. ఈ వన్డే ద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా ధోని నిలిచాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్(463), రాహుల్ ద్రవిడ్(344), మహమ్మద్ అజారుద్దీన్(334), సౌరవ్ గంగూలీ(311), యువరాజ్ సింగ్(302)లు మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు.

ఇక అంతర్జాతీయ స్థాయిలో చూసుకుంటే.. 300 వన్డేలను పూర్తి చేసుకోబోతున్న 20వ ఆటగాడిగా ధోని నిలిచాడు. ఇక భారత్ తరుపున క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 463 వన్డే మ్యాచ్‌లు ఆడి.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. సచిన్ తర్వాత ప్రపంచ క్రికెట్‌లో మాజీ కెప్టెన్ మహేళ జయవర్దనే 448 వన్డేలతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఆ తర్వాత కూడా శ్రీలంక ధిగ్గజాలే ఉన్నారు. జయసూర్య 445 వన్డేలు, సంగాకర 404 వన్డేలు ఆడారు. వీరు నలుగురు మాత్రమే నాలుగు వందలకు పైగా వన్డే మ్యాచ్‌లను ఆడారు. దాదాపు 12 ఏళ్ల కెరీర్‌లో వన్డేల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా ఎదిగి, ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ధోని తన వన్డే కెరీర్‌లో 300వ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు.

దీంతో ఈ మైలురాయి వన్డే మ్యాచ్‌లో ధోని గుర్తుండి పోయే ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఐదు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే మూడు వన్డేల్లో విజయం సాధించి కోహ్లీసేన సిరిస్‌ను కైవసం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని కోహ్లీసే పట్టుదలతో ఉండగా, మిగిలిన రెండు మ్యాచ్‌లలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని శ్రీలంక ఆశిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా మలింగ వ్యవహరిస్తున్నాడు. మరోవైపు ఇప్పటికే సిరిస్‌ను సొంతం చేసుకోవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడు మార్పులు చేశాడు. పేసర్ భువనేశ్వర్ కుమార్‌కి విశ్రాంతినివ్వగా అతని స్థానంలో యువ పేసర్ శార్ధూల్ ఠాకూర్ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు.
మిడిలార్డర్‌లో టోర్నీ ఆరంభం నుంచి విఫలమవుతున్న కేదార్ జాదవ్‌పై వేటు వేసిన కెప్టెన్ కోహ్లి.. మనీశ్ పాండేకి అవకాశమిచ్చాడు. మరో స్పిన్నర్ చాహల్‌కి విశ్రాంతినివ్వగా అతని స్థానంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కి తుది జట్టులో చోటు కల్పించాడు.
జట్ల వివరాలు:
భారత్: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, లోకేశ్ రాహుల్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, శార్ధూల్ ఠాకూర్
శ్రీలంక: డిక్వెల్లా, దిల్షాన్ మునవీరా, కుశాల్ మెండిస్, తిరుమానె, మాథ్యూస్, సిరివర్దనె, హసరంగ, ధనంజయ, పుష్పకుమార, విశ్వ, మలింగ (కెప్టెన్ )