హైదరాబాద్: వెస్టిండిస్‌తో జరిగిన నాలుగో వన్డేలో కోహ్లీ సేన ఓటమి పాలవ్వడాన్ని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తీవ్రంగా తప్పుబట్టారు. స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో విఫలం కావడానికి బ్యాట్స్‌మెన్ల వైఫల్యమే ప్రధాన కారణమని అన్నారు.
చెత్త బ్యాటింగ్ వల్లే గెలిచే మ్యాచ్‌ని చేజార్చుకున్నామని మ్యాచ్ అనంతరం సంజయ్ బంగర్ అసహనం వ్యక్తం చేశాడు. 'విండీస్ విసిరిన లక్ష్యం కష్టమైనది ఎంతమాత్రం కాదు. మా బ్యాట్స్‌మెన్ స్ట్రయిక్ రొటేట్ చేయడంలో విఫలయ్యారు. ప్రధానంగా తొలి పది ఓవర్లలో కీలక వికెట్లు కోల్పోవడం కూడా మా ఓటమిపై ప్రభావం చూపింది' అని బంగర్ అన్నాడు.

'మరొవైపు పిచ్ కూడా స్లోగా ఉంది. దాంతో షాట్ సెలక్షన్ అనేది అంత సులభం కాదనే విషయం అర్ధమైంది. అయినా ఇది చాలా తక్కువ స్కోరు. గత మ్యాచ్‌లో కూడా ఇలాంటి సందర్భమే ఎదురైనా, జట్టు స్కోరుని 260 పరుగుల వరకు తీసుకెళ్లడంలో బ్యాట్స్‌మెన్ సఫలమయ్యారు' అని తెలిపాడు.
'పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన టీమిండియా తన శక్తి సామర్ధ్యాలకు తగ్గట్టు ఆడకపోవడం వల్లే ఓటమి పాలయ్యం. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజాతులా వదులుకున్నాం. దాంతో కడవరకూ వచ్చి పరాజయం చెందాల్సి వచ్చింది. ఓపెనర్ రహానే అవుటయ్యే ముందు వరకూ మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది' అని చెప్పాడు.
"రహానే అవుటయ్యాక ఒక్కసారి పరిస్థితి మారిపోయింది. ఛేదనకు కావాల్సిన రన్ రేట్ పెరుగుతూ వచ్చింది. వరుసగా వికెట్లను కోల్పోయి ఓటమి అంచున నిలిచాం' అని బంగర్ తెలిపాడు. ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో 190 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 178 పరుగులు చేసిన ఆలౌటైంది.
చివర్లో ఏడు బంతులకు 14 పరుగులు చేయాల్సిన దశలో ధోని అవుట్ కావడంతో వెస్టిండీస్ విజయం ఖాయమైంది. ధోని అవుటైన తర్వాత టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయి ఓటమి పాలైంది. దీంతో కోహ్లీసేనపై వెస్టిండిస్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.