చేసుకున్న వాడికి చేసుకున్నంత: రోహిత్ సేన ప్యాకప్

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో ఇది మూడో విక్టరీ. హ్యాట్రిక్ విజయాలను అందుకుందీ జట్టు. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లోకల్ టీమ్ ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లోనూ ఘోరంగా ఓడింది రోహిత్ సేన. వరుసగా నాలుగు పరాజయాలను అందుకుంది. ఓటముల్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో సమవుజ్జీగా నిలిచింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారింది.

ఆల్‌రౌండ్ ఫెయిల్యూర్స్
తొలుత బ్యాటింగ్‌లో.. అనంతరం బౌలింగ్‌లో ముంబై ఇండియన్స్ ఘోరంగా విఫలమైంది. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో చేతులెత్తేసింది. ఓపెనర్లు ఫర్వాలేదనిపించుకున్నా.. ఆ తరువాతి బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు.. ఒక్క సూర్యకుమార్ యాదవ్ తప్ప. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తొలి వికెట్ భాగస్వామ్యానికి 50 పరుగులు అందించినప్పటికీ.. దానిపై భారీ ఇన్నింగ్‌ను నిర్మించుకోవడంలో ముంబై బ్యాటర్లు విఫలం అయ్యారు.

వారిద్దరూ డకౌట్..
వన్‌డౌన్ బ్యాటర్, బేబీ ఏబీ డివిలియర్స్ డెవాల్డ్ బ్రెవిస్ ఇంకా ఐపీఎల్ ఫార్మట్‌కు అలవాటు పడలేదు. అతని బ్యాటింగ్ తడబాటు కనిపించింది. ఎనిమిది పరుగులకే పెవిలియన్ చేరాడు. రమణ్‌దీప్ సింగ్‌దీ అదే పరిస్థితి. సింగిల్ డిజిట్ లోపే అవుట్ అయ్యాడు. హైదరాబాదీ తిలక్ వర్మ, కరేబియన్ కింగ్ కీరన్ పొల్లార్డ్.. కనీసం తమ ఖాతాలను కూడా తెరవలేకపోయారు. తాను ఎదుర్కొన్న తొలిబంతికే పొల్లార్డ్ వెనుదిరిగాడు. తిలక్ వర్మ రనౌట్‌కు బలి అయ్యాడు. వీరిద్దరిలో ఎవరు కుదురుకుని ఉన్నా భారీ స్కోర్ చేయడానికి అవకాశం ఉండేది.

ఓటమిలో బౌలర్ల సాయం..
సొంత జట్టు ఓటమి పాలుకావడానికి ముంబై ఇండియన్స్ బౌలర్లు తమవంతు కృషి చేశారు. 19 ఓవర్లల్లో వారు పడగొట్టింది. రెండంటే రెండు వికెట్లే. అందులో ఓ వికెట్ చేతుల కాలిన తరువాత పడింది. జయదేవ్ ఉనద్కత్, డెవాల్డ్ బ్రెవిస్ తలో వికెట్ తీసుకున్నారు. మురుగన్ అశ్విన్, కీరన్ పొల్లార్డ్ భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. పోరాడదగ్గ లక్ష్యమే కావడం, బౌలర్లు పెద్దగా భయపెట్టలేకపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ విజయానికి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది.

రోహిత్ సేన పరిస్థితేంటీ..?
ఐపీఎల్ సీజన్ ఆరంభమై ఇన్ని రోజులైనప్పటికీ.. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు గెలుపు రుచి చూడనేలేదు. ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లోనూ పరాజయాలే ఎదురయ్యాయి. ఇకపై గెలుస్తుందనే గ్యారంటీ లేదు. గెలిచినా.. టైటిల్ రేసులో ఉంటుందనే నమ్మకమూ కోల్పోయింది. ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత నైట్ రైడర్స్.. ఇప్పుడీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతుల్లో మట్టి కరిచింది రోహిత్ సేన. ప్యాకప్ చేసుకోవడానికి రెడీగా ఉండక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్.. తోడుగా ఉందా జట్టుకు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications