
లక్నో చేతిలో రెండోసారి..
ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ తీరు ఏ మాత్రం మారలేదు.. మెరుగుపడనూ లేదు. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో రెండోసారి పరాభవాన్ని చవి చూసింది. ముగ్గురు బ్యాటర్లు మాత్రమే డబుల్ డిజిట్ ఫిగర్‌ను అందుకున్నారు. తన ప్రత్యర్థి నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని కూడా అందుకోలేకపోయిందంటే ఆ జట్టు ఎంత అధ్వాన్నంగా ఆడుతోందనేది అర్థమౌతోంది.
కాస్త గట్టిగా పోరాడితే ఛేదించదగ్గ స్కోరే అది.బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా విఫలం అయిన మ్యాచ్ ఇది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పైనే కేఎల్ రాహుల్ మరో సెంచరీ చేశాడు.

ఇషాన్ కిషన్ ఫ్లాప్ షో..
స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. ఈ మ్యాచ్‌లో అతను చేసింది ఎనిమిది పరుగులే. ఫస్ట్ డౌన్ డెవాల్డ్ బ్రెవిస్, కీరన్ పొల్లార్డ్, ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్ మళ్లీ మళ్లీ విఫలమౌతున్నారు. ఫర్వాలదేనిపించుకుంటోన్న సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్‌లో చేతులెత్తేశాడు. ఏడు పరుగులకే అవుట్ అయ్యాడు. జట్టు మొత్తం కలిసి చేసిన స్కోర్ 132 పరుగులు మాత్రమే. మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ అనే పేరుకు తగ్గట్టుగా ఆడటంతో ఘోరంగా విఫలమైంది.

రోహిత్ ఫర్వాలేదనిపించుకున్నా..
వరుస వైఫల్యాలతో సతమతమతున్న కేప్టెన్ రోహిత్ శర్మ కొంత పుంజుకోగలిగాడు. 39 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇది. మిడిలార్డర్‌లో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ 38 పరుగులతో ఆదుకోకపోయి ఉంటే ముంబై ఇండియన్స్ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేది. కీరన్ పొల్లార్డ్ ఆకార పుష్టిగా మాత్రమే కనిపించాడు. 20 బంతుల్లో 19 పరుగులు చేసి, పెవిలియన్ చేరాడు.

బౌలింగ్ నాసిరకం..
స్టార్ హోదా ఉన్న బౌలింగ్ డిపార్ట్‌మెంట్ మరీ అధ్వాన్నంగా మారింది. జస్‌ప్రీత్ బుమ్రా ఒక వికెట్‌తోనే సరిపెట్టుకున్నాడు. ఈ సీజన్‌లో అతను పడగొట్టిన వికెట్లు అయిదు మాత్రమే. ఇదివరకు పర్పుల్ క్యాప్ కోసం పోటీ పడిన బుమ్రా ఇతనేనా అనిపించేంత నాసిరకంగా బంతులను వేస్తున్నాడీ స్టార్ పేసర్. జయదేవ్ ఉనద్కత్ వికెట్ లెస్. కిందటి మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ విజృంభణకు బలైన తరువాత అతను రిథమ్ తప్పినట్టే కనిపిస్తోంది. డేనియల్ సామ్స్, రిలే మెరెడిత్ వికెట్లు పడగొట్టినా.. ఓవర్‌కు 10 చొప్పున పరుగులను ధారబోశారు.

ముంబై అవుట్
ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు గెలుపు రుచి చూడలేదు. ఆడిన ఎనిమిదింట్లోనూ పరాజయాలే ఎదురయ్యాయి. ఇకపై గెలుస్తుందనే గ్యారంటీ లేదు. ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలగింది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు వెళ్లలేని మొదటి జట్టు ఇదే అయింది. ఇంకో ఆరు మ్యాచ్‌లను ఆడాల్సి ఉందా జట్టుకు. తన తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడాల్సి ఉంది. శనివారం సాయంత్రం 7:30 గంటలకు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఉంటుంది. గెలిచినా పెద్దగా ఉపయోగపడదు.


Click it and Unblock the Notifications
