
మలుపుతిప్పిన మహరాజ్..
భారీ లక్ష్యచేధనలో టీమిండియా కేఎల్ రాహుల్(12) వికెట్ కోల్పోయినా.. శిఖర్ ధావన్(84 బంతుల్లో 10 ఫోర్లతో 79), విరాట్ కోహ్లీ(63 బంతుల్లో 3 ఫోర్లతో 51) సూపర్ బ్యాటింగ్‌తో విజయం దిశగా నడిచింది. ఈ ఇద్దరు క్రీజులో ఉన్నంత సేపు మ్యాచ్ పూర్తిగా భారత్ వైపే ఉంది. అయితే కేశవ్ మహరాజ్ తన 26వ ఓవర్లో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఈ ఓవర్ మూడో బంతిని అద్బుతంగా టర్న్ చేసిన మహరాజ్.. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న శిఖర్ ధావన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ బంతికి విరాట్ కోహ్లీతో పాటు శిఖర్ ధావన్ బిత్తరపోయారు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ వికెట్‌తో మ్యాచ్ సౌతాఫ్రికావైపు టర్న్ అయింది. ఆ కొద్దిసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీని షంసీ బోల్తా కొట్టించడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది.

మిడిలార్డర్ వైఫల్యం..
కోహ్లీ వికెట్ కోల్పోయిన సమయానికి భారత్ 152 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఏ ఇద్దరు నిలబడినా భారత్ విజయం ఖాయమని అంతా భావించారు. కానీ ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన రిషభ్ పంత్(16), శ్రేయస్ అయ్యర్(17), వెంకటేశ్ అయ్యర్(2) దారుణంగా విఫలమయ్యారు. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడినా భారత్ ఫలితం మరోలా ఉండేది. చివర్లో శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీతో టీమిండియా ఘోర పరాజయాన్ని తప్పించాడాన్ని చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది.

పసలేని బౌలింగ్, ఫీల్డింగ్
టీమిండియా బౌలర్ల వైఫల్యం కూడా భారత ఓటమికి కారణమైంది. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు తీసిన భారత్.. ఆ శుభారంభాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. ముఖ్యంగా టెంబా బువుమా, డస్సెన్‌ల భాగస్వామ్యాలను విడదీయలేకపోయింది. వికెట్ కోసమే ప్రయత్నించి ధారళంగా పరుగులు సమర్పించుకుంది తప్పా వ్యూహాత్మకంగా బౌలింగ్ చేయలేకపోయింది. ముఖ్యంగా చాహల్, భువనేశ్వర్, లార్డ్ శార్డూల్ వైఫల్యం బౌలింగ్ టీమ్‌ను బలహీనంగా మార్చింది. వికెట్లు తీయకపోయినా.. స్లాగ్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేసి తక్కువ స్కోర్‌కు కట్టడి చేసినా బ్యాట్స్‌మన్ పని సులువయ్యేది.

రాహుల్ చెత్త కెప్టెన్సీ..
తాత్కలిక సారథిగా జట్టును నడిపించిన కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్‌గా మైదానంలో కీలక నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. బవుమా, డస్సెన్ సూపర్ పార్ట్నర్షిప్తో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే ఫీల్డ్ సెటప్, బౌలింగ్ చేంజేస్లో ఘోర తప్పిదాలు చేశాడు. దాంతో మైదానంలో భారత ఫీల్డర్లు చాలా తప్పిదాలు చేశారు. ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా జట్టులోకి తీసుకున్న వెంకటేశ్ అయ్యర్‌కు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వకుండా అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రాహుల్‌కు తోడు టీమ్‌మేనేజ్‌మెంట్ కూడా సరైన ప్రణాళికలు రచించలేకపోయింది.