గ్రాస్ ఐలెట్: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా వరుసగా మూడు సిరీస్ విజయం దక్కించుకుంది. 2006, 2010లలో కరీబీయన్లను ఓడించిన భారత్.. ప్రస్తుతం జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలిండుగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి టెస్టులో గెలిచి, రెండో టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. మూడో టెస్టులో 237 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మూడో రోజు వర్షం కారణంగా ఆట రద్దయినా మ్యాచ్‌పై భారత్ పట్టువదల్లేదు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ఆదిలోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో అశ్విన్, సాహాలు అద్భుత శతకాలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ను 225 పరుగులకు కట్టడి చేయడంతో 128 పరుగుల ఆధిక్యం లభించింది. భారత్ పూర్తిగా ఆటపై పట్టు సాధించి రెండో ఇన్నింగ్స్‌ను 217/7కు డిక్లేర్డ్ చేసి 346 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శనతో 108 పరుగులకే కుప్పకూలడంతో విజయం భారత్ సొంతమైంది. భారత బౌలర్లలో షమీ 3, ఇషాంత్ 2, జడేజా 2, అశ్విన్, భువనేశ్వర్ కుమార్ చెరో వికెట్ తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత శతకం సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
ఆనందానికి అవధుల్లేవు: గర్వంగా ఉందని కోహ్లీ
వెస్టిండీస్ గడ్డపై ఆరేళ్ల అనంతరం టెస్టు సిరీస్ ను గెలుచుకున్న విరాట్ కోహ్లీ సేన ఆనందానికి ఇప్పుడు అవధుల్లేవు. గతంలో వెస్టిండీస్ పై పర్యటనలు జరిపిన భారత జట్టు విజయాలు సాధించి, సిరీస్ లను కొల్లగొట్టగా, ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, హ్యాట్రిక్ సిరీస్ విజయం సాధించిన భారత జట్టు కెప్టెన్ కోహ్లీ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
2006, 2010లో కరేబియన్లను ఓడించిన భారత జట్టు, ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టగా, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్ లపై వరుస విజయాలతో కోహ్లీ సేన మరో హ్యాట్రిక్ కొట్టింది. ఇక ఆటగాళ్లతో బస్సులో ప్రయాణిస్తున్న వేళ, తీసుకున్న ఫోటోను కోహ్లీ సామాజిక మాధ్యమాల్లో పెడుతూ, తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఈ విజయంతో తన ఆనందానికి హద్దులు లేవని, గర్వపడుతున్నామని చెప్పుకొచ్చాడు.