గ్రాస్ ఐలెట్: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 353 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్, సాహా సెంచరీలతో భారత్.. ఓ దశలో 339/5తో పటిష్ట స్థితిలో నిలిచినా.. 14 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లు కోల్పోయి భారీ స్కోరు సాధించే అవకాశాన్ని కోల్పోయింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. ఓపెనర్ జాన్సన్‌ను 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ రనౌట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో బ్రాత్‌వైట్ 53, బ్రావో 18 పరుగులతో ఉన్నారు.
తొలి రోజు భారత్‌ను దెబ్బ తీసిన యువ పేసర్ అల్జారి జోసెఫ్ (3/69).. సాహాను ఔట్ చేసి భారీ భాగస్వామ్యానికి తెరదించాడు. రవీంద్ర జడేజా (6)ను కమిన్స్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత ఐదు బంతుల తేడాతో భువనేశ్వర్ (0), అశ్విన్, ఇషాంత్ (0) ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 234/5తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియాను అశ్విన్, సాహా నడిపించారు. తొలిరోజు ఆటలో తక్కువ స్కోరుకే ఆలౌటయ్యే ప్రమాదం నుంచి బయటపడేసిన ఈ ద్వయం.. రెండో రోజూ ఆచితూచి బ్యాటింగ్ చేసింది.
అశ్విన్ సింగిల్స్ తీసుకుంటూ నిలకడగా ఆడగా, సాహా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. అశ్విన్ తొలిరోజు ఆటలోనే అర్ధసెంచరీ చేసుకోగా.. రెండోరోజు సాహా 135 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్దిసేపట్లో లంచ్ అనగా.. అశ్విన్ సెంచరీ ముంగిట నిలిచాడు.
99 పరుగుల వద్ద లంచ్‌కు వెళ్లిన అశ్విన్... వచ్చిన వెంటనే చేజ్ బౌలింగ్‌లో సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సిరీస్‌లో అశ్విన్‌కు ఇది రెండో శతకం. కాసేపటికి చేజ్ బౌలింగ్‌లోనే రెండు పరుగులు చేసి.. సాహా కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీళ్ల శతకాలు పూర్తయిన తర్వాత భారత్ పతనం మొదలైంది. భారత తొలి ఇన్నింగ్స్ 300 పరుగులు దాటగడంలో అశ్విన్, సాహా కీలక భూమిక పోషించారు.