
కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతున్న వచ్చిన రంజీ ట్రోఫీకి ఎట్టకేలకు సమయం ఆసన్నమైంది. రెండేళ్ల నిరీక్షణకు తెర దించుతూ నేటి నుంచే ఈ ప్రముఖ దేశవాళీ టోర్నీ ప్రారంభంకానుంది. జాతీయ జట్టుకు ఎందరో స్టార్ ఆటగాళ్లను అందించిన ఈ టోర్నీ ఈ సారి కూడా కుర్రాళ్ల టాలెంట్‌ను వెలికి తీసేందుకు సిద్ధమైంది. కుర్రాళ్లే కాకుండా పలువురు సీనియర్ ఆటగాళ్లు, భారత జట్టులో స్థానం కోల్పోయిన పలువురు ఆటగాళ్లు ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. మొత్తం 9 వేదికల్లో జరగనున్న ఈ టోర్నీలో 38 జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌లకు చెన్నై, తిరువనంతపురం, కటక్, రాజ్‌కోట్, అహ్మదాబాద్, ఢిల్లీ, హరియాణా, గువాహటి, కోల్‌కతా అతిథ్యమివ్వనున్నాయి. ఎనిమిది గ్రూపుల్లో నాలుగేసి జట్ల చొప్పున 32 జట్లు ఎలైట్‌లో తలపడనుండగా, ఆరు జట్లు ప్లేట్ గ్రూపులో అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాయి.
టోర్నీలో మొత్తం 65 మ్యాచ్‌ల జరగనున్నాయి. ఇందులో లీగ్‌లోనే 57 మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే మార్చి చివర్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కానుండడంతో రంజీ ట్రోఫీ 2022ను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. లీగ్ మ్యాచ్‌ల వరకు ఐపీఎల్ ముందు వరకు నిర్వహించి, ఐపీఎల్ ముగిసిన తర్వాత నాకౌట్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. నాకౌట్ మ్యాచ్‌లు మే 30 నుంచి జూన్ 26 వరకు జరగనున్నాయి. చాలా కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఫాంలో లేక ఇబ్బంది పడుతున్న టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, చటేశ్వర్ పుజారా కూడా ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నారు. రహానే ముంబై తరఫున, పుజారా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగునున్నారు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న పోటీ దృష్యా రానున్న శ్రీలంక సిరీస్‌కు ఎంపికవ్వాలంటే పుజారా, రహానే ఈ రంజీ ట్రోఫీలో తప్పకుండా రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కూడా ఈ టోర్నీలో ఆడనున్నాడు.
రంజీ ట్రోఫీలో తెలుగు జట్లు హైదరాబాద్, ఆంధ్ర కూడా పాల్గొంటున్నాయి. తన్మయ్ అగర్వాల్ కెప్టెన్సీలోని హైదరాబాద్ జట్టు ఎలైట్ గ్రూపు 'బి'లో బెంగాల్, బరోడా, చండీగఢ్‌తో తలపడునుంది. ఈ మ్యాచ్‌లు కటక్‌లో జరగనున్నాయి. శ్రీకర్ భరత్ సారథ్యంలోని ఆంధ్ర జట్టు రాజస్థాన్, సర్వీసెస్, ఉత్తరాఖండ్ జట్లతో కూడిన ఎలైట్ గ్రూపు 'ఈ' లో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ తిరువనంతపురంలో జరగనున్నాయి.