హైదరాబాద్: సరిగ్గా 30 ఏళ్ల కిందట ఇదే రోజు క్రికెట్ అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. ఈ హ్యాట్రిక్‌ను తీసింది ఎవరో కాదు భారత బౌలర్ చేతన్ శర్మ. వరల్డ్ కప్‌లో భాగంగా 1987, అక్టోబర్ 31న నాగ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం జరిగింది.
చేతన్ శర్మ హ్యాట్రిక్‌తో మ్యాచ్ గెలిచిన టీమిండియా సెమీస్‌కు చేరింది. న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్లు కెన్ రూథర్‌ఫర్డ్, ఇయాన్ స్మిత్, ఎవెన్ చాట్‌ఫీల్డ్‌లను చేతన్ శర్మ తన హ్యాట్రిక్ వికెట్లతో పెవిలియన్‌కు పంపాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ముగ్గురు బ్యాట్స్‌మెన్ క్లీన్‌బౌల్డ్ కావడం.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 222 పరుగులు చేసింది. దీంతో కివీస్ నిర్దేశించిన 223 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.2 ఓవర్లలో చేధించాల్సి వచ్చింది. అయితే ఓపెనర్లు శ్రీకాంత్, గవాస్కర్ వీరోచిత బ్యాటింగ్‌తో కేవలం 32.1 ఓవర్లలోనే భారత్ టార్గెట్‌ను చేధించింది.
దీంతో 1987 వరల్డ్ కప్‌లో భారత్ సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ శ్రీకాంత్ 58 బంతుల్లో 75 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సునీల్ గవాస్కర్ సెంచరీ నమోదు చేశాడు. వన్డేల్లో గవాస్కర్ నమోదు చేసిన ఏకైక సెంచరీని ఈ మ్యాచ్‌లోనే సాధించాడు.
కేవలం 85 బంతుల్లో గవాస్కర్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో సునీల్ గవాస్కర్ మొత్తం 88 బంతుల్లో 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.