కింగ్‌స్టన్: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో కూడా ఇన్నింగ్స్ విజయం ఖాయమనుకున్న టీమిండియాకు నిరాశే ఎదురైంది. నాలుగోరోజు కురిసిన వర్షంతో విజయం వాయిదా పడుతుందనుకున్న టెస్ట్.. చివరికి అనూహ్యంగా డ్రాకు దారితీసింది.
విండీస్ బ్యాట్స్‌మెన్ రోస్టన్ ఛేజ్ (137-269 బంతుల్లో 15ఫోర్లు, ఒక సిక్స్)తో అజేయ పోరాట ఫలితంగా చివరికి మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదటి నాలుగురోజులు అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు ఆఖరి రోజు చేతులెత్తేయడంతో విజయం భారత్ చేజారిపోయింది.

నాలుగోరోజు 48 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన విండీస్ ఐదో రోజు అనూహ్యంగా పుంజుకుంది. అప్పటికే క్రీజులో ఉన్న బ్లాక్‌వుడ్ మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయాడు. వన్డే తరహాలో దూకుడుగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. అతడికి తోడుగా ఛేజ్ కూడా నిలగడగా ఆడుతూ రెచ్చిపోయాడు.
బ్లాక్‌వుడ్ కేవలం 41 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తిచేశాడు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 17.4 ఓవర్లలో 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అశ్విన్ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి బ్లాక్‌వుడ్ (63) వెనుదిరిగాడు. ఛేజ్ క్రీజులో నిలదొక్కుకోవడం.. అతడికి డౌరిచ్ తోడవ్వడంతో స్కోరు మరోసారి వేగం పుంజుకుంది. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

బౌండరీలతో పరుగుల వేగాన్ని పెంచిన డౌరిచ్(74)ను మిశ్రా పెవిలియన్‌కు పంపాడు. ఇంతలో ఛేజ్ తన కెరీర్ తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హోల్డర్ 64 (నాటౌట్)సైతం దూకుడు ప్రదర్శించడంతో మ్యాచ్ ముగిసే సరికి విండీస్ 388/6 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 196కే విండీస్ ఆలౌట్ కాగా.. భారత్ 500/9 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
తొలి ఇన్నింగ్స్‌లో విజృంభించిన భారత బౌలర్లు ఐదురోజు చేతులెత్తేశారు. నాలుగోరోజు నాలుగు కీలక వికెట్లు తీసి విండీస్‌ను కష్టాల్లోకి నెట్టిన బౌలర్లు.. ఆఖరి రోజు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. చివరి రోజు 88 ఓవర్లు ఆడిన విండీస్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 340 పరుగులు చేసింది. దీన్ని బట్టి చూస్తే విండీస్ బ్యాట్స్‌మన్‌పై మన బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని తెలుస్తోంది. ఏదేమైనా ఇన్నింగ్స్ విజయం అనుకున్న రెండో టెస్ట్.. మన బౌలర్లు విఫలమవడం, ఛేజ్ క్రీజులో నిలదొక్కుకోవడంతో డ్రాగా ముగిసింది.
గ్యారీ సోబర్స్ రికార్డు సమం చేసిన ఛేజ్
1962, 1966లో జరిగిన టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచుల్లో 5 వికెట్లు తీయడంతో పాటు రెండు సెంచరీలు చేశాడు. టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో 5వికెట్లు తీయడంతోపాటు సెంచరీ నమోదు చేసి ఛేజ్.. సోబర్స్ రికార్డును సమం చేశాడు.