కింగ్‌స్టన్: వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యతను సాధించింది. తొలి ఇన్నింగ్స్‌ను 500/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండిస్‌పై భారత జట్టు 304 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. 358/5తో టీమిండియా తొలి ఇన్నింగ్స్ కొనసాగించింది.
మూడు రోజు వరుణుడు అడ్డుపడటంతో ఆటకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆటను ముగిస్తున్నట్లు అంపెర్లు ప్రకటించారు. లోకేశ్ రాహుల్ (158) భారీ శతకానికి తోడు అజింక్యా రహానె సెంచరీతో రాణించడంతో భారత జట్టు భారీ స్కోరును సాధించింది. కాని అప్పటికీ మూడో రోజు మ్యాచ్ ఆడేందుకు రెండు గంటల సమయం ఉన్నప్పటికీ వర్షం తగ్గకపోవడంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించలేకపోయింది.
ఉదయం సెషన్‌లో తొలి గంటసేపు విండీస్ పేసర్లు గాబ్రియెల్, కమిన్స్ మెరుగ్గా బౌలింగ్ చేసినా రహానె దీటుగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో సాహా కూడా వీలు చిక్కినప్పుడల్లా స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. వీరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు విండీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.
చివరికి లంచ్‌కు ముందు సాహాను హోల్డర్ వికెట్ల ముందు క్యాచ్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఆరో వికెట్‌కు రహానె-సాహా 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. విండీస్ బౌలర్లలో చేజ్ ఐదు వికెట్లు తీశాడు. రహనే(108 నాటౌట్) రాణించాడు. సాహాతో 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

రహానేకు టెస్టుల్లో ఇది 7వ సెంచరీ. ఇందులో ఐదు సెంచరీలు ( ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండిస్) విదేశాల్లోనే సాధించడం విశేషం. ఈ సెంచరీతో విదేశీ పర్యటనల్లో తానెంత విలువైన ఆటగాడినో మరోసారి నిరూపించాడు. భారత జట్టులో పుజారా (47), ధావన్ (27) సాహా (47), కెప్టెన్ కోహ్లీ (44), రహానె (108), మిశ్రా (21), షమీ (0), యాదవ్ (19) పరుగులు సాధించారు.
అంతక ముందు టీ బ్రేక్ తర్వాత విండీస్ కొత్త బంతితో మూడు కీలక వికెట్లు పడగొట్టింది. డబుల్ సెంచరీ దిశగా సాగుతున్న కేఎల్ రాహుల్ అనుమానాస్పద నిర్ణయానికి అవుటయ్యాడు. గాబ్రియెల్ లెగ్‌సైడ్ సంధించిన బంతిని లోకేశ్ ఫ్లిక్ చేసేందుకు ప్రయత్నించాడు. కీపర్ డౌరిచ్ క్యాచ్ అందుకున్నాడు.
బంతి బ్యాట్‌కు తాకలేదన్న భావనతో రాహుల్ నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీతో రహానె జత కలిశాడు. బిషూ వేసిన 103వ ఓవర్లో కోహ్లీ సిక్సర్, రెండు ఫోర్లతో జోరు ప్రదర్శించాడు. అయితే తర్వాతి ఓవర్లోనే చేజ్ బౌలింగ్‌లో విరాట్ క్యాచ్ అవుటయ్యాడు. మిగతా రెండు రోజుల్లో వెస్టిండీస్‌ను ఆలౌట్ చేస్తే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2/0 ఆధిక్యంలో నిలువనుంది.